స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన వైద్యులు అద్భుతం చేశారు. కోటాకు చెందిన వ్యక్తి శరీరం నుంచి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 92 గుండుపిన్నులను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆయన శరీరంలో ఆహార వాహిక, శ్వాసనాళం, ఇతర ముఖ్యమైన భాగాల్లో ఇంకా 60 దాకా గుండుపిన్నులున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 56 ఏళ్ల బద్రిలాల్ రైల్వే ఉద్యోగిగా చేస్తున్నారు. మూడు నెలలుగా ఆయనకు కడపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. షుగర్ పేషేంట్ అయిన ఆ వ్యక్తికి ఇటీవల కాలికి గాయమైంది.
స్థానిక ఆస్పత్రిలో ట్రీట్మెంట్కు తీసుకెళ్లగా గుండుపిన్ను గుచ్చుకుని గాయమైందని చెప్పారు. అసలే షుగర్ పేషెంట్ కావడంతో బద్రిలాల్ బాడీని స్కాన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆయన శరీరంలో ఏకంగా వందకి పైగా గుండుపిన్నులున్నట్లు గుర్తించారు. ఆయన సమస్యకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆరు ఆస్పత్రుల వైద్యులు నిరాకరించారు. చివరగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వారు అతికష్టం మీద చికిత్స నిర్వహించి 92 సూదులు తొలగించారు. ఇంకా అరవైదాకా సూదులను తీయాల్సి ఉందని, ప్రస్తుతం అబ్జర్వేషన్లో పెట్టినట్లు వైద్యులు తెలిపారు.
బద్రిలాల్ సమస్య గానీ, ఆయన శరీరంలో గుండుపిన్నులు ఉన్నట్లు కుటుంబభ్యులతో పాటు బాధిత పేషెంట్‌కు తెలియక పోవడం గమనార్హం. గత మూడు నెలల సమయంలో బద్రిలాల్ 30 కిలోల బరువు తగ్గడం, కాలికి అయిన గాయం తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో ఆయన సమస్య వెలుగుచూసింది. మరికొన్ని సర్జరీలు చేసి మిగిలిన సూదులను తొలగించాలని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని తెలిపారు.