plastic flags
-
పంద్రాగస్టు : ప్లాస్టిక్ జెండా ఎగరేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాను ఉపయోగించరాదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్ 1971, ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ జెండాల బదులు పేపర్‌తో తయారు చేసిన జెండాలనే ఉపయోగించాలని సూచించారు. పేపర్ జెండాలను కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని ఆదేశించారు. జెండాను అవమానించే రీతిలో ప్రవర్తించరాదని, అది దేశ ప్రజల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపమని హోంశాఖ పేర్కొంది. కార్యక్రమం అనంతరం పేపర్ జెండాలను కూడా జాగ్రత్తగా, అవమానం కలగని రీతిలో ఉంచాలని సూచించారు. -
ఆ త్రివర్ణ పతాకమే ఉపయోగించాలి
సాక్షి, హైదరాబాద్: కాగితాలు, వస్త్రాలపై తయారుచేసిన మూడు రంగుల జెండాను మాత్రమే జాతీయ దినోత్సవాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకు ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్ జెండాలు వాడరాదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) అజయ్‌మిశ్రా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు గురువారం ఆదేశాలు ఇచ్చారు. త్రివర్ణ పతాకాలను అలంకరణలకు ఉపయోగించరాదని, ముఖ్యమైన జాతీయ దినాలు, క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో దాన్ని ఊపవచ్చన్నారు. జెండా ఆవిష్కరణలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయో.. లేదో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. జెండాను అగౌరవపరిస్తే నేరంగా పరిగణిస్తామన్నారు.