PLGA Week celebrations
-
మళ్లీ అలజడి ..అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: అడవుల్లో మళ్లీ అలజడి నెలకొంది. సీపీఐ(మావోయిస్టు) పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల నేపథ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. కొయ్యూరు ఎన్కౌంటర్ స్మృత్యార్థం వారోత్సవాలను ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వారం ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఓవైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల చర్యలు అడవిలో కలకలం రేపుతున్నాయి. వారోత్సవాలను విజయవంతం చేయాలని లేఖలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం చేయగా, ‘అమాయక ఆదివాసీలను అంతం చేసే మావోయిస్టులు’అంటూ వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాగా, మరో రెండు/రోజుల్లో ముగిసే పీఎల్జీఏ వారోత్సవాలను తెలంగాణలో నిర్వహించాలన్న మావోయిస్టుల ప్లాన్‌ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం నుంచి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పూర్వ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పహారా కాస్తోంది. అడవులు జల్లెడ.. అరెస్టులు, ఎన్కౌంటర్లు.. జేఎస్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్, ఆసిఫాబాద్ జిల్లాలను ఆనుకుని ఉన్న గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా వేశారు. ఈ సందర్భంగా నెలరోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో 22 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 31 మంది లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో ఇటీవల బాలాఘాట్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో జీఆర్బీ, కేబీ డివిజన్ కోఆర్డినేషన్ టీం ఇన్చార్జి గణేశ్ మరావి(35), భోరమ్‌దేవ్ కమిటీ పీఎల్–2 కమాండర్ రాజేశ్ మృతి చెందగా, ఓ మహిళామావోయిస్టు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు–మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి(40), మట్వారా ఎల్వోఎస్ సభ్యుడు రమేశ్(32), మహిళా మావోయిస్టునేత సుమిత్ర (28), మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా మావోయిస్టు కొరియర్‌గా తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు నిత్యనిర్బంధంలోనూ మావోయిస్టులు విదేశీ ఆయుధాలను వాడుతుండటం మూడు రాష్ట్రాల పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో 1978లో మొదట తపంచాతో మొదలైన సాయుధీకరణ ఏకే–47, ఎల్‌ఎంజీల వరకు వెళ్లగా, ప్రస్తుతం అమెరికా, రష్యా మేడ్ ఆయుధాలను వాడుతుండటం గమనార్హం. మొదట పూర్వ కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన అగ్రనేత పులి రాములు వద్ద ఏకే–47 తుపాకీ పోలీసులకు లభించింది. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు– మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్ తుపాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పీఎల్జీఏ వారోత్సవాలు మరో రెండు రోజులే ఉన్న సందర్భంగా మావోయిస్టులు అధునాతన ఆయుధసంపత్తిని కూడా ఉపయోగించే అవకాశముందన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్, పారా మిలటరీ బలగాలు మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో మోహరించడం కలకలం రేపుతోంది. -
నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు
సాక్షి, కాళేశ్వరం: సీపీఐ (పీపుల్స్‌వార్) విప్లవోద్యమంలో ధ్రువతారలుగా వెలిగిన నాయకులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, శీలం నరేష్ అలియాస్ మురళి ఎన్కౌంటర్లో మరణించి నేటికీ (సోమవారం) 20 ఏళ్లు పూర్తవుతుంది. వీరు భూ స్వామ్య, సామ్రాజ్యవాద నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ పీపుల్స్‌వాల్ అగ్ర నాయకులుగా ఎదిగారు. 1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్మూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. ఈ ముగ్గురు నేలకొరిగిన కొమ్మూర్ ఎన్కౌంటర్ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్ పార్టీకి చరిత్రలో ఎప్పటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలింది. అప్పటి నుంచి పోలీసులు అగ్ర నేతలపై దృష్టి పెట్టి ఏరివేతనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న పీపుల్స్‌వార్ పార్టీ 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పూర్తిగా బలహీన ప డుతూ వస్తుంది. రాష్ట్రంలో ఉనికి కోసం తాపత్రయ పడుతూ ఇటీవల కాటారం సబ్ డివిజన్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల పేరుతో కరపత్రాలతో వేస్తూ ఉనికి చాటుతున్నారు. అమరుల యాదిలోనే.. అగ్రనాయకుల జ్ఞాపకార్థ ఎన్‌కౌంటర్‌అయిన మరుసటి ఏడాది 2000 డిసెంబర్ 2న పీఎల్జీ ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)ను ఏర్పాటు చేశారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతియేట డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు వా రోత్సవాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘానే పెట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాట కుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భద్రత..మహదేవపూర్ మండలంలో ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, సరస్వతీ బ్యారేజీలతో పాటు లక్ష్మీపంపుహౌస్‌లకు ఇంటిలిజెన్స్ నిఘా విభాగం హెచ్చరికలతో భద్రతను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు నేటి నుంచి జరిగే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాటకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోలను కట్టడి చేయడానికి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. -
టెన్షన్.. టెన్షన్
విశాఖ మన్యంలో ఎన్కౌంటర్లలో కంటే మందుపాతర పేలుడులోనే ఎక్కువ మంది పోలీసులు మరణించారు. అదే వ్యూహం అమలుతో పోలీసుల ప్రాణాలుతీయాలని మావోయిస్టులు ప్రయత్నించారు. వీరవరం ఘటనలో డీసీ స్థాయి నేత శరత్ ప్రాణాలు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి ప్రతీకారంగా భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగానే నక్కపల్లి అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. మన్యంలో లేటరైట్ తవ్వకాలు ప్రారంభం నాటి నుంచీ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చేరుతున్నాయన్న అనుమానాలున్నాయి. (సాక్షి, నెట్వర్క్): పీఎల్జీఏ వారోత్సవాలు ఇటు పోలీసులకు, అటు మావోయిస్టులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇవి సోమవారంతో ముగియనున్నాయి. తమకు పూర్తిగా పట్టున్న ఏవోబీలో వారోత్సవాల విజయవంతానికి దళసభ్యులు యోచిస్తుండగా.. ఎలాగైనా అడ్డుకొని తీరాలని పోలీసుశాఖ ప్రయత్నిస్తున్నది. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అదనుగా బలగాలపై విరుచుకుపడాలని దళసభ్యులు భాస్తున్నారు. ఓడిశా,ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి మకాం వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత వరకు కోరాపుట్ ప్రాంతంలో ఉన్న కాకూరిపండన్న అలియాస్ జగన్ కూడా ఈస్టు డివిజన్‌లోకి వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన వస్తే తప్పకుండా ఏదో ఒక విధ్వంసానికి పాల్పడతారన్న అనుమానం వ్యక్తమవుతోంది. లేటరైట్ తవ్వకందారులు కొందరు పేలుడు పదార్థాలను మావోయిస్టులకు సరఫరా చేసినట్టుగా పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. బొడ్డేపల్లిలో పేలుడు పదార్థాలను గుర్తించినప్పుడే వాటిలో కొంత మావోయిస్టులకు చేరి ఉంటుందని అనుమానించారు. దీనిని ధ్రువీకరిస్తూ.. ఈ నెల 5న జీకేవీథి మండలం నక్కబంద అటవీ ప్రాంతంలో పోలీసులు లక్ష్యంగా రెండు మందుపాతరలను సుమారు రెండేళ్ల అనంతరం పేల్చారు. అయితే అవి లక్ష్యాన్ని చేధించలేకపోయాయి. అదే సమయంలో దసభ్యులు కూడా అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తున్నది. దీని వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరం సంఘటన నేపథ్యంలో ప్రతికారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏదైనా బలమైన సంఘటనకు పాల్పడాలన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. మన్యంలో మావోయిస్టు కార్యకలాపాలను అణచి వేయడంతోపాటు గిరిజనుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని సాక్షాత్తు జిల్లా రూరల్ ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇదే సమయంలో పీఎల్జీఏ వారోత్సవాలు వచ్చాయి. మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న జీకేవీధి మండలం కుంకంపూడి అటవీ ప్రాంతంలో 50 అడుగుల భారీ స్థూపాన్ని మావోయిస్టులు ఇటీవలే నిర్మించారు. వారోత్సవాల్లో దీనిని ఆవిష్కరించి ఇటీవల కోరుకొండలో హతులైన మావోయిస్టు అగ్రనేతలు శరత్, గణపతిలకు నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది తెలుసుకున్న పోలీసులు దానిని భగ్నం చేసి మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేయాలని కుంకంపూడి, నక్కబంద అటవీమార్గంలో గాలింపు చేపట్టారు. ఇది తెలుసుకున్న దళసభ్యులు భద్రత బలగాలు లక్ష్యంగా శుక్రవారం సాయంత్రం రెండు మందు పాతరలను పేల్చారు. ఈ సంఘటనలో పోలీసులకు ఎటువంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు. మావోయిస్టులు మందు పాతర పేల్చకుండా ఉంటే ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి ఉండేవి. కుంకంపూడి ఇందుకు ప్రధాన వేదిక అయ్యేదని ఈ సంఘట తీరు స్పష్టం చేస్తోంది. కుంకంపూడిలో స్థూపావిష్కరణకు దళసభ్యులు వస్తారని భావించిన బలగాలు పరిసర ప్రాంతాల్లో తిష్ట వేశాయి. వారోత్సవాలప్పుడు ఏటా ఈ ప్రాంతంలో రాతిస్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలను ఘనంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సారి మాత్రం వారోత్సవాల భగ్నానికి అడుగడుగునా పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అడవుల్లో వందలాదిగా ఉన్న గ్రేహాండ్స్, ఎస్వోసీ, బీఎస్ఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. చిత్రకొండ, సీలేరు, దారకొండ ప్రాంతాల్లో ఆదివారం నాటి వారపుసంతలు బోసిపోయాయి. గిరిజనులు, పోలీసులు మాత్రం వారోత్సవాలు ముగిసే వరకు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.