విశాఖ మన్యంలో ఎన్‌కౌంటర్లలో కంటే మందుపాతర పేలుడులోనే ఎక్కువ మంది పోలీసులు మరణించారు. అదే వ్యూహం అమలుతో పోలీసుల ప్రాణాలుతీయాలని మావోయిస్టులు ప్రయత్నించారు. వీరవరం ఘటనలో డీసీ స్థాయి నేత శరత్ ప్రాణాలు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి ప్రతీకారంగా భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగానే నక్కపల్లి అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. మన్యంలో లేటరైట్ తవ్వకాలు ప్రారంభం నాటి నుంచీ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చేరుతున్నాయన్న అనుమానాలున్నాయి.
(సాక్షి, నెట్‌వర్క్): పీఎల్‌జీఏ వారోత్సవాలు ఇటు పోలీసులకు, అటు మావోయిస్టులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇవి సోమవారంతో ముగియనున్నాయి. తమకు పూర్తిగా పట్టున్న ఏవోబీలో వారోత్సవాల విజయవంతానికి దళసభ్యులు యోచిస్తుండగా.. ఎలాగైనా అడ్డుకొని తీరాలని పోలీసుశాఖ ప్రయత్నిస్తున్నది. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అదనుగా బలగాలపై విరుచుకుపడాలని దళసభ్యులు భాస్తున్నారు. ఓడిశా,ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి మకాం వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంత వరకు కోరాపుట్ ప్రాంతంలో ఉన్న కాకూరిపండన్న అలియాస్ జగన్ కూడా ఈస్టు డివిజన్‌లోకి వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన వస్తే తప్పకుండా ఏదో ఒక విధ్వంసానికి పాల్పడతారన్న అనుమానం వ్యక్తమవుతోంది. లేటరైట్ తవ్వకందారులు కొందరు పేలుడు పదార్థాలను మావోయిస్టులకు సరఫరా చేసినట్టుగా పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. బొడ్డేపల్లిలో పేలుడు పదార్థాలను గుర్తించినప్పుడే వాటిలో కొంత మావోయిస్టులకు చేరి ఉంటుందని అనుమానించారు.
దీనిని ధ్రువీకరిస్తూ.. ఈ నెల 5న జీకేవీథి మండలం నక్కబంద అటవీ ప్రాంతంలో పోలీసులు లక్ష్యంగా రెండు మందుపాతరలను సుమారు రెండేళ్ల అనంతరం పేల్చారు. అయితే అవి లక్ష్యాన్ని చేధించలేకపోయాయి. అదే సమయంలో దసభ్యులు కూడా అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తున్నది. దీని వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరం సంఘటన నేపథ్యంలో ప్రతికారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏదైనా బలమైన సంఘటనకు పాల్పడాలన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది.
మన్యంలో మావోయిస్టు కార్యకలాపాలను అణచి వేయడంతోపాటు గిరిజనుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని సాక్షాత్తు జిల్లా రూరల్ ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇదే సమయంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు వచ్చాయి. మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న జీకేవీధి మండలం కుంకంపూడి అటవీ ప్రాంతంలో 50 అడుగుల భారీ స్థూపాన్ని మావోయిస్టులు ఇటీవలే నిర్మించారు.
వారోత్సవాల్లో దీనిని ఆవిష్కరించి ఇటీవల కోరుకొండలో హతులైన మావోయిస్టు అగ్రనేతలు శరత్, గణపతిలకు నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది తెలుసుకున్న పోలీసులు దానిని భగ్నం చేసి మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేయాలని కుంకంపూడి, నక్కబంద అటవీమార్గంలో గాలింపు చేపట్టారు. ఇది తెలుసుకున్న దళసభ్యులు భద్రత బలగాలు లక్ష్యంగా శుక్రవారం సాయంత్రం రెండు మందు పాతరలను పేల్చారు. ఈ సంఘటనలో పోలీసులకు ఎటువంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు.
మావోయిస్టులు మందు పాతర పేల్చకుండా ఉంటే ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి ఉండేవి. కుంకంపూడి ఇందుకు ప్రధాన వేదిక అయ్యేదని ఈ సంఘట తీరు స్పష్టం చేస్తోంది. కుంకంపూడిలో స్థూపావిష్కరణకు దళసభ్యులు వస్తారని భావించిన బలగాలు పరిసర ప్రాంతాల్లో తిష్ట వేశాయి. వారోత్సవాలప్పుడు ఏటా ఈ ప్రాంతంలో రాతిస్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలను ఘనంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ సారి మాత్రం వారోత్సవాల భగ్నానికి అడుగడుగునా పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అడవుల్లో వందలాదిగా ఉన్న గ్రేహాండ్స్, ఎస్‌వోసీ, బీఎస్‌ఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. చిత్రకొండ, సీలేరు, దారకొండ ప్రాంతాల్లో ఆదివారం నాటి వారపుసంతలు బోసిపోయాయి. గిరిజనులు, పోలీసులు మాత్రం వారోత్సవాలు ముగిసే వరకు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
టెన్షన్.. టెన్షన్
Published Mon, Dec 8 2014 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement