అడకత్తెరలో అధికారులు
‘కొత్త పిచ్చోడు పొద్దెరగడు’ అనేది ముతక సామెతే కానీ.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి.. తీరా సర్కారు కొలువుదీరిన తర్వాత ఇంకా సరిగ్గా కుదురుకోలేని పరిస్థితుల్లోనే ఉన్న టీడీపీ నేతలు ముందుగా అధికారులపై అడ్డంగా పడిపోతున్నారు. చోటామోటా నేతల నుంచి మంత్రుల వరకు ఎక్కడికక్కడ, ఎవరికి వారు తమ దర్పమంతా అధికారులపైనే చూపిస్తున్నారు. ఇక జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. మంత్రులిద్దరూ జిల్లాస్థాయి అధికారులను తమ వెంటే ఉండాలని హుకుం జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం జిల్లాలో అన్నిచోట్లా ఒకేసారి మొదలైంది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వీరవాసరం మండలం అండలూరులో జరిగిన కార్యక్రమంలో, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అధికారులంతా తాము పాల్గొనే సదస్సులోనే ఉండాలని ఇరువురు మంత్రులూ పట్టుపట్టడంతో అధికారులు నానాకష్టాలూ పడ్డారట. మొత్తం మీద వ్యవసాయ శాఖ జేడీ ఇద్దరి వద్దా హాజరు వేయించుకుని అటు కొంతమంది.. ఇటు కొంతమంది అధికారులను సర్దుబాటు చేసినా ఏలూరు మండలం చాటపర్రులో కేబినెట్ హోదా
కలిగిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొనే కార్యక్రమానికి ఎవరు వెళ్లాలనే విషయమై అధికారుల నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారట. అసలే అధికారులపై చీటికీమాటికీ ఇంతెత్తున లేచే ప్రభాకర్ వద్దకు వెళ్లాలంటే తలలు పండిన అధికారులకు సైతం చెమటలు పడుతుంటాయి. అయితే జిల్లాస్థాయి ఉన్నతాధికారి అక్కడికి వెళ్లడంతో ఆ రోజుకు హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాగైతే రానున్న కాలంలో ఎన్నికష్టాలు ఎదుర్కోవాలో అంటూ అధికారులు టెన్షన్ పడుతున్నారట.
మరోవైపు.. అధికారిక కార్యక్రమాల ఆహ్వానాలను తమను స్వయంగా కలిసి ఇవ్వాలని, లేదంటే వచ్చేది లేదంటూ ప్రజాప్రతినిధులు భీష్మిస్తున్నారట. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల ఇదే అం శాన్ని రాద్ధాంతం చేయడంతో ఒకటికి మూడుసార్లు అధికారులు సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయన్ను రావాల్సిందిగా బతిమిలాడారట. ఇలా అధికారులు ప్రతి చిన్న పనికి ప్రజాప్రతినిధుల దర్శనం కోసం ఇతర పనులు మానుకుని కాళ్లరిగేలా వాళ్ల ఇళ్ల చుట్టూ తిరగడానికే కాలం సరిపోతోందని అంటున్నారు. మొత్తంగా ఈ రెండు నెలల పాలన చూస్తే.. అంతకుముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలోని పోకడలే మళ్లీ మొదలయ్యాయంటూ అధికారులు ఒకరి కష్టాలను ఒకరికి చెప్పుకుంటూ గుండె బరువు దించుకుంటున్నారట.
‘పవర్’ చూపిన పోలీస్
జిల్లాకు కొత్తగా వచ్చిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు రౌడీలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారపార్టీ వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఏ అధికారైనా వచ్చిన కొత్తలో ఇటువంటి ప్రకటనలే చేస్తుంటారు. కానీ మన జిల్లాకు వచ్చిన అధికారులు చేతల్లో చేసి చూపించారు. అధికారం వచ్చిందన్న దన్నుతో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండటమన్నది అంకన్నగూడెం ఘటన సాక్షిగా ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఏలూరు నగరంలో టీడీపీ నేతలూ తామేం తక్కువ కాదంటూ ఇటీవల ఓ యువకుడిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
ఆ యువకుడి బంధువులు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు కావడం, ప్రస్తుత ఎస్పీ రఘురామ్‌రెడ్డి గతంలో అక్కడ పనిచేయడంతో ఉన్న పరిచయాల దృష్ట్యా నేరుగా ఆయన్ని కలిశారు. ఆయన స్పం దించడంతో పోలీసులు నగర డెఫ్యూటీ మేయర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను కేసునుంచి బయటపడేయాలని పోలీసులపై ఎంత ఒత్తిళ్లు, ఆబ్లిగేషన్స్ వచ్చినా అధికారులు లెక్క చేయలేదు. ఇరువురు ఎమ్మెల్యేలు అదే పనిగా తిరిగినా.. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను కటకటాల్లోకి తోశారు. పవర్లో ఉన్నాం.. ఏమైనా చెల్లుబాటవుతుందని విర్రవీగుతున్న వారికి అసలు ‘పవర్’ చూపించిన అధికారులు ఇదే పట్టు కొనసాగిస్తారా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు