polaramma jathara
-
పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలి
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వెంకటగిరి: పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఆలయ ఈఓ రామచంద్రరావు, సీఐ శ్రీనివాసరావును ఆరా తీశారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగ తరహాలో వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. క్యూలైన్లలో మార్పులు చేయాలన్నారు. వీఐపీలు, రూ.250 టికెట్ భక్తులు ఎదురు వరుసలో రావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అన్ని క్యూలు ఆంజనేయస్వామి ఆల యం వీధి నుంచే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అనంతరం పోలేరమ్మ పుట్టిల్లు అయి న కుమ్మరి ఇంటిని పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చిట్టేటి హరికృష్ణ, నక్కా వెంకటేశ్వరరావు, జి.ఢిల్లీబాబు, గిరిరెడ్డి, చిరంజీవి, బి.రత్నాకర్‌రెడ్డి, కౌన్సిలర్ గౌస్‌బాషా తదితరులు ఉన్నారు. -
దండాలు..దండాలు..పోలేరమ్మ తల్లో..
అమ్మవారి నిలుపు నేడు లక్షలాదిగా రానున్న భక్తులు మడిభిక్షాలకు చిన్నారులు సన్నద్ధం నేటి నుంచి భక్తులతోనిండనున్న వెంకటగిరి వెంకటగిరి:బంధాలు, అనుబంధాల కలయికకు వేదికైన వెంకటగిరి జాతరలో ప్రధాన ఘట్టానికి రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచి అసలు సందడి మొదలు కానుంది. అమ్మవారి విగ్రహం తయారీ పనులు ఉదయం నుంచే ఊపందుకోనున్నాయి. మిరాసీదారులు (కుమ్మరులు) వెంకటగిరి చెరువు నుంచి పుట్టమట్టిని, నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా ఇసుక తీసుకొచ్చి విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు మంగళవారమే ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తయారీ ప్రారంభించి రాత్రి 7 గంటలకు పూర్తి చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటలకు అమ్మవారిపై వస్త్రం కప్పి మెట్టినిల్లయిన జీనుగులవారివీధిలోని చాకలి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళతారు. పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండీ.. బుధవారం తెల్లవారే సరికి పట్టణంలో చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి చిన్నపాటి ఎదురు బుట్టకు పసుపు, కుంకుమ వేప ఆకులతో అలంకరించి ఇంటింటికి వెళ్లి మడిభిక్షాలు ప్రారంభిస్తారు. పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి..పోతురాజులకు టెంకాయ కోట్టండి.. పగలకపోతే మా నెత్తిన కొట్టండి.. అంటూ పాడుతూ మడిభిక్షం కోసం ఇంటింటికీ తిరుగుతారు. దీంతో పట్టణంలో జాతర సందడి మరింత జోరందుకుంటుంది. పలువురు భక్తులు తమ పిల్లలతో మడిభిక్షం ఎత్తిస్తామని పోలేరమ్మకు మొక్కుకుంటారు. అందులో భాగంగానే తమ పిల్లలను ఇంటింటికి పంపి వారు సేకరించిన బియ్యం, నగదును ఆసాదులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. అంతేగాక బుధవారం ఉదయం ప్రతి ఇంటిలో అంబళ్లు చేసి భక్తులకు పంచిపెడుతారు. మధ్యాహ్నం ఇంట్లో అమ్మవారిని పసుపుతో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గాలిగంగులతో శక్తిస్వరూపం.. గాలి గంగులు అనగా గంపలో పిండిదీపం పెట్టి గంపలకు పసుపు కుంకుమ వేప ఆకులతో అలకరించి అమ్మవారిని రమ్మని ఆహ్వానిస్తారు. ఈ తంతు పట్టణంలో కాంపాళెంలో జరుగుతుంది. గాలిరూపంలో చేరిన అమ్మవారిని అప్పటికే జీనుగులవారివీధిలోని మెట్టినిల్లు అయిన చాకలిఇంటికి చేరిన పోలేరమ్మ విగ్రహంలోకి ఆసాదులు ఆ శక్తిని ప్రవేశింపజేస్తారు. అప్పడు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారెలు సమర్పిస్తారు. కళ్లు, బొట్టు పెడతారు. అనంతరం కోడిపుంజును అమ్మవారికి దిష్టితీసి కోసి రక్తంతో దిష్టిచుక్కను పెడతారు. అప్పుడు అమ్మవారు పరిపూర్ణశక్తి స్వరూపిణిగా మారుతారని భక్తుల విశ్వాçÜం. అక్కడే భక్తుల దర్శనార్ధం అమ్మవారిని ఉంచి ప్రత్యేకంగా పూలతో అలకరించిన రథంపై కొలువుదీర్చుతారు. తర్వాత పాతకోట మీదుగా పోలేరమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటుచేసే ప్రత్యేక వేపాకుల మండపంలో నిలుపు చేస్తారు. గురువారం తెల్లవారుజాము నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది రానుండటంతో వెంకటగిరి జనసంద్రంగా మారనుంది. ప్రతి ఇంటా బంధుమిత్రుల కోలాహలం నెలకొననుంది. -
అద్దెకు రెక్కలు
నెల ముందుగానే బుకింగ్ షురూ లాడ్జిలన్నీ హౌస్‌ఫుల్ అంటున్న నిర్వాహకులు సమ్మెటివ్ పరీక్షల నేపథ్యంలో జాతర సిబ్బందికీ వసతి కరువే వెంకటగిరి: పోలేరమ్మ జాతర వెంకటగిరిలోని లాడ్జి యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. జాతరలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో పలువురు లాడ్జిల్లో ఆశ్రయం పొందుతారు. అయితే ఈ ఏడాది లాడ్జిల నిర్వాహకుల చెప్పే అద్దెలు విని నోరెళ్లబెడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని దోచుకునేందుకు లాడ్జిల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నెలముందే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ హౌస్‌ఫుల్ అని సమాధానమిస్తున్నారు. ఎలాగోలా చేయాలని కోరితే చేంతాడంత అద్దెలు చెబుతున్నారు. పట్టణంలో సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆరు రెట్లు వరకు పెంచి గదుల స్థాయి(ఏసీ, నాన్ఏసీ)రూ.2 వేలు నుంచి రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక బుధవారం ఏ సమయంలో రూము తీసుకున్నా, గురువారం ఉదయం 10 గంటల వరకు తప్పనిసరిగా ఉంచుకుని రెండు రోజుల అద్దె చెల్లించాల్సిందేనని షరతులు పెడుతున్నారు. అధికారులకు తప్పని తిప్పలు జాతర విధుల్లో పాలుపంచుకునేందుకు వచ్చే పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ఏటా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మదర్ అకాడమి స్కూలుతో పాటు పలు పాఠశాలల్లో వసతి కల్పిస్తారు. అయితే ఈ ఎడాది ఈనెల 21వ తేదీ నుంచి సమ్మెటివ్ ఎసెసెమెంట్ –1 పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. సరిగ్గా జాతర ప్రారంభమయ్యే 21వ తేదీన సంస్కృతం సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభం అవుతాయి. వెంకటగిరిలోని ఉన్నత పాఠశాల స్థాయిలో సంస్కృతం సబ్జెక్ట్æ లేకపోవడంతో 22వ తేదీన ప్రారంభంకానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా ఈ పరీక్షలు నిర్వహించనుండడంతో జాతర విధులకు హజరయ్యే సిబ్బందికి వసతి ఏర్పాటుపై స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాడ్జి యజమానులను కొన్ని గదులు కేటాయించాలని హుకుం జారీ చేస్తుండడంతో వారి ఆశలకు గండిపడనుంది. ఇక ప్రత్యామ్నయంగా స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలను సిబ్బంది వసతి కోసం వినియోగించే చర్యలు చేపట్టారు.