సంక్రాంతి గోపాలుడు
విశ్వంలో పరిణమిల్లే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. అలాంటప్పుడు మానవుల ఈతిబాధలకు కారకుడు దైవం కాక మరెవరు? ఈ ప్రశ్ననే సమాజంపై సంధించాడు ఓ వ్యక్తి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏకంగా దైవం పైనే కేసు బనాయించాడు. మరి దానికి దైవం ఎలా స్పందించాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘గోపాల గోపాల’. దేవుడిపైనే కేసు వేసే గోపాల్రావుగా వెంకటేశ్ నటిస్తుంటే, సాక్షాత్ గోపాలునిగా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు.
నాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్చక్రవర్తి ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్లో రూపొందిన ‘ఓమైగాడ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథలోని ఆత్మ చెడకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వచ్చే సన్ని వేశాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని సమాచారం.
ప్రస్తుతం వారిద్దరిపైనే హాస్పిటల్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. వెంకటేశ్‌కి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో మధుశాలిని, పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి, కృష్ణుడు, దీక్షాపంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు.