potency test
-
బీజేపీ ఎమ్మెల్యేకు పటుత్వ పరీక్ష..!
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతి పొందడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగార్‌కు కోర్టు విధించిన 12 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అతన్ని నేడు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముందుగానే సీబీఐ అధికారులు కోర్టుకి దరఖాస్తు చేయనున్నారు. విచారణలో సెంగార్ ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెప్పడంతో సీబీఐ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నావ్ అత్యాచార ఘటనలో సెంగార్ సోదరులను అరెస్ట్ చేసినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్థానిక పోలీసులు సాహసించలేకపోయారు. సీఎం యోగి అదిత్యనాథ్ సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్, ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు తనపై ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని సెంగార్ పేర్కొన్నారు. -
ఆయన పురుషుడే!
కోర్టుకు చేరిన నిత్యానంద పురుషత్వ పరీక్షల నివేదిక 31 పేజీల నివేదికను అందజేసిన సీఐడీ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సంబంధించిన పురుషత్వ పరీక్షల నివేదిక రామనగర సెషన్స్ కోర్టుకు బుధవారం చేరింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 31పేజీల నివేదికను కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు నిపుణుల నిర్వహించిన పరీక్షల్లో నిత్యానంద తన వయసు తగ్గట్టు శారీరక, మానసిక పరిపక్వత చెందారని... అందువల్ల ఆయన పురుషత్వ పరీక్షల్లో ‘పాస్’ అయినట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం. -
విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్న నిత్యానంద
బెంగళూరు : కోర్టు ఆదేశాల నేపథ్యంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద సోమవారం ఉదయం పుంసత్వ పరీక్ష నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించనున్నారు. లైంగిక సామర్థ్య పరీక్షలకు హాజరు కావల్సిందిగా సీఐడీ డీఎస్పీ నాలుగు రోజుల క్రితం నిత్యానందకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. దాంతో సిఐడి అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. -
నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకుండా చూడాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పురుషత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి కర్ణాటక హై కోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై అంతకుముందు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు స్టే తొలగించింది. దీంతో నిత్యానంద పురుషత్వ, రక్త తదితర పరీక్షలు చేయించేకోవాల్సివుంటుంది. -
స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: 2010 సంవత్సరంలో నమోదైన రేప్ కేసులో స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేప్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలు తప్పనిసరి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై నమోదైన రేప్ కేస్ లో లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు నిత్యానంద అంగీకరించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ప్రస్తుత కాలంలో రేప్ కేసులు ఎక్కువ మోతాదులో నమోదవుతున్న కారణంగా ఇలాంటి పరీక్షలు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. లింగ సామర్ధ్య పరీక్షలు నిర్వహించకూడదా అంటూ నిత్యానందను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రశ్నించారు. బలవంతంగా పరీక్షలు జరిపితే తాను అంగీకరించనని నిత్యానంద కోర్టును వేడుకున్నారు. ఈ కేసులో పరీక్షలు జరపడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నారని పోలీసులకు కోర్టు చురకలంటించింది. -
తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు
పనాజీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పోలీసులు సోమవారం గోవా మెడికల్ కాలేజీలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పుంసత్వ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. లైంగిక దాడుల కేసులో ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి కావడంతో పోలీసులు ఉదయమే ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు వివిధ పరీక్షలు చేయించి తీసుకువెళ్లారు. మళ్లీ మధ్యాహ్నం 3.15 గంటలకు మరికొన్ని పరీక్షల కోసం తీసుకువచ్చారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, హ్యూమన్ బిహేవియర్(ఐపీహెచ్బీ)కి తీసుకువెళ్లి మానసిక ప్రవర్తనకు సంబంధించిన టెస్టులు కూడా పూర్తిచేశారు. తేజ్పాల్ను ఫైవ్‌స్టార్ హోటల్‌కు కూడా తీసుకువెళ్లిన పోలీసులు... సహోద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు గోవా మెడికల్ కాలేజీ డీన్ వీఎన్ జిందాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో శనివారం తేజ్పాల్ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం స్థానిక కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించడంతో పోలీసు అధికారులు ఏకధాటిగా ఐదు గంటలపాటు విచారించారు. ప్రస్తుతం పనాజీలోని జైల్లో ఉన్న తేజ్‌పాల్.. మానవతావాద దృక్పథంతో తన గదిలో ఫ్యాన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. లాకప్‌లో అక్రమ వేటగాళ్ల మధ్య.. హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులతో మొదటిరోజు లాకప్ పంచుకున్న తేజ్‌పాల్... రెండోరోజు కప్పలు, తాబేళ్లను అక్రమంగా వేటాడే నలుగురు నిందితుల మధ్య గడిపారు. పోర్చుగీస్ కాలం నాటి ఓ పురాతన భవనంలో ఉన్న ఈ జైల్లో మొత్తం మూడు సెల్స్ ఉన్నాయి. ఇందులో తేజ్పాల్ను ఐదు మీటర్ల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న ఓ గదిలో ఉంచారు. రాత్రంతా నిద్ర కరువవడంతో తేజ్‌పాల్ అలసటగా కనిపించారని, ముఖం ఉబ్బి, కళ్లు ఎర్రగా మారాయని పోలీసు వర్గాలు చెప్పాయి.