తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు | Tarun Tejpal's potency test positive | Sakshi
Sakshi News home page

తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు

Published Tue, Dec 3 2013 1:52 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు - Sakshi

తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు

పనాజీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పోలీసులు సోమవారం గోవా మెడికల్ కాలేజీలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పుంసత్వ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. లైంగిక దాడుల కేసులో ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి కావడంతో పోలీసులు ఉదయమే ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు వివిధ పరీక్షలు చేయించి తీసుకువెళ్లారు. మళ్లీ మధ్యాహ్నం 3.15 గంటలకు మరికొన్ని పరీక్షల కోసం తీసుకువచ్చారు.
 

అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, హ్యూమన్ బిహేవియర్(ఐపీహెచ్‌బీ)కి తీసుకువెళ్లి మానసిక ప్రవర్తనకు సంబంధించిన టెస్టులు కూడా పూర్తిచేశారు. తేజ్‌పాల్‌ను ఫైవ్‌స్టార్ హోటల్‌కు కూడా తీసుకువెళ్లిన పోలీసులు... సహోద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు గోవా మెడికల్ కాలేజీ డీన్ వీఎన్ జిందాల్ తెలిపారు.

సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో శనివారం తేజ్‌పాల్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం స్థానిక కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించడంతో పోలీసు అధికారులు ఏకధాటిగా ఐదు గంటలపాటు విచారించారు. ప్రస్తుతం పనాజీలోని జైల్లో ఉన్న తేజ్‌పాల్.. మానవతావాద దృక్పథంతో తన గదిలో ఫ్యాన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
 
 లాకప్‌లో అక్రమ వేటగాళ్ల మధ్య..
 హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులతో మొదటిరోజు లాకప్ పంచుకున్న తేజ్‌పాల్... రెండోరోజు కప్పలు, తాబేళ్లను అక్రమంగా వేటాడే నలుగురు నిందితుల మధ్య గడిపారు. పోర్చుగీస్ కాలం నాటి ఓ పురాతన భవనంలో ఉన్న ఈ జైల్లో మొత్తం మూడు సెల్స్ ఉన్నాయి. ఇందులో తేజ్‌పాల్‌ను ఐదు మీటర్ల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న ఓ గదిలో ఉంచారు. రాత్రంతా నిద్ర కరువవడంతో తేజ్‌పాల్ అలసటగా కనిపించారని, ముఖం ఉబ్బి, కళ్లు ఎర్రగా మారాయని పోలీసు వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement