Tehelka magazine
-
తప్పు చేయనప్పుడు క్షమాపణలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల విచారణ చేపట్టిన సుప్రీం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తేజ్‌పాల్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ‘నా క్లయింట్ సీనియర్ జర్నలిస్టు అయినందుకే అతన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార లైంగిక ఆరోపణలు చేశారు’అని వాదించారు. ‘హోటల్ లాబీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించండి. బాధితురాలు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం కూడా లేదు. లిఫ్ట్‌లో వేధింపులకు గురిచేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తేజ్‌పాల్, సదరు జర్నలిస్టుపై మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. జరిగిన సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆరోపణలు తప్పు అని రుజువు అవుతాయి’ అన్నారు. వికాస్ సింగ్ ఆరోపణల్ని గోవా పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ఆయన చేస్తున్న ఆరోపణలు విచారణ అనర్హమన్నారు. వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వులో ఉంచింది. అంతకు ముందు సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక ఆరోపణలు నిరాధారమే అయితే తేజ్‌పాల్ బాధితురాలికి ఎందుకు క్షమాపణలు చెప్పాడని ప్రశ్నించింది. ‘ఏమీ జరగకపోతే, మీరు క్షమాపణలు చెప్పేవారు కాదు. ఆరు సంవత్సరాల కిత్రం జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతూ ఇప్పుడు లేఖ పంపించారు. దానికి కారణాలేంటో తెలియాలి. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది’అని కోర్టు అభిప్రాయపడింది. కేసు పూర్వపరాలు.. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి యత్నించాడని అదే సంస్థలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. 2013లో వెలుగుచూసిన ఈ ఘటన అప్పట్లో సంచలన రేకెత్తించింది. హోటల్ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ లైంగికంగా వేదింపులకు గురిచేశాడని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ షోమాకు ఈ-మెయిల్ పంపారు. అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్‌పాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాడని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా మీడియాకు చెప్పారు. బాధితురాలి కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్పాల్ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేయడమేగాక ఘటనపై గోవాలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. గోవాలోనే ఉండి విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో తనని అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు ముడుపులు తీసుకోవడాన్ని తేజ్‌పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్‌లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్మెన్ ఓం బహదూర్ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్ అనే మరో వాచ్మెన్ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పే వీడియోలు.. అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్‌లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్‌లో ఉండేవని మాథ్యూస్ తెలిపారు. ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు. -
ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్‌షీట్
పనాజి : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యిందని... ఫిబ్రవరి 5న ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తరుణ్ తేజ్‌పాల్ ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. మరోవైపు కటకటాల్లో ఉన్న తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను గోవా కోర్టు విచారించింది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. -
తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
పోలీస్ లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చేసిన విజ్క్షప్తిని గోవా కోర్టు తిరస్కరించింది. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జుడిషియల్ మేజిస్ట్రేట్ క్షమా జోషి తిరస్కరించారు. లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను పానాజీ పోలీస్ కస్టడీలో ఉంచారు. మానవత దృక్పథంతో తన క్లయింట్ కు లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తేజ్ పాల్ లాయర్ డిసెంబర్ 2 తేదిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్ పాల్ కు బుధవారం రెండవసారి వైద్య పరీక్షలు జరిపించారు. డిసెంబర్ 2 తేదిన గోవా మెడికల్ కాలేజి, హస్పిటల్ లో వైదపరీక్షలతోపాటు, లైంగిక పటుత్వ పరీక్షలు జరిపిన సంగతి జరిపారు. శనివారం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో తేజ్ పాల్ కు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించారు. గోవాలో ఓ కార్యక్రమం సందర్భంగా సహ ఉద్యోగి, మహిళా జర్నలిస్ట్ ను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది. -
తేజ్‌పాల్‌కు పుంసత్వ పరీక్షలు
పనాజీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పోలీసులు సోమవారం గోవా మెడికల్ కాలేజీలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పుంసత్వ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. లైంగిక దాడుల కేసులో ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి కావడంతో పోలీసులు ఉదయమే ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు వివిధ పరీక్షలు చేయించి తీసుకువెళ్లారు. మళ్లీ మధ్యాహ్నం 3.15 గంటలకు మరికొన్ని పరీక్షల కోసం తీసుకువచ్చారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, హ్యూమన్ బిహేవియర్(ఐపీహెచ్బీ)కి తీసుకువెళ్లి మానసిక ప్రవర్తనకు సంబంధించిన టెస్టులు కూడా పూర్తిచేశారు. తేజ్పాల్ను ఫైవ్‌స్టార్ హోటల్‌కు కూడా తీసుకువెళ్లిన పోలీసులు... సహోద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు గోవా మెడికల్ కాలేజీ డీన్ వీఎన్ జిందాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో శనివారం తేజ్పాల్ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం స్థానిక కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించడంతో పోలీసు అధికారులు ఏకధాటిగా ఐదు గంటలపాటు విచారించారు. ప్రస్తుతం పనాజీలోని జైల్లో ఉన్న తేజ్‌పాల్.. మానవతావాద దృక్పథంతో తన గదిలో ఫ్యాన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. లాకప్‌లో అక్రమ వేటగాళ్ల మధ్య.. హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులతో మొదటిరోజు లాకప్ పంచుకున్న తేజ్‌పాల్... రెండోరోజు కప్పలు, తాబేళ్లను అక్రమంగా వేటాడే నలుగురు నిందితుల మధ్య గడిపారు. పోర్చుగీస్ కాలం నాటి ఓ పురాతన భవనంలో ఉన్న ఈ జైల్లో మొత్తం మూడు సెల్స్ ఉన్నాయి. ఇందులో తేజ్పాల్ను ఐదు మీటర్ల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న ఓ గదిలో ఉంచారు. రాత్రంతా నిద్ర కరువవడంతో తేజ్‌పాల్ అలసటగా కనిపించారని, ముఖం ఉబ్బి, కళ్లు ఎర్రగా మారాయని పోలీసు వర్గాలు చెప్పాయి. -
ఉత్థాన పతనాలు సంచలనమే!
‘స్టింగ్’ పోటుతో అనూహ్యంగా ఎదిగిన తేజ్‌పాల్ లైంగిక దాడి కేసుతో దారుణంగా దిగజారిన ప్రతిష్ట ‘తెహెల్కా’ అంటే సంచలనం అని అర్థం. సంచలనమే ఊపిరిగా మొదలైన ‘తెహెల్కా’ మీడియా సంస్థ దేశంలో పెను సంచలనాలనే సృష్టించింది. మీడియా ‘స్టింగ్’పోటు ఎలా ఉంటుందో దేశంలోని పెద్దతలకాయలకు రుచి చూపింది ‘తెహెల్కా’నే. రహస్య కెమెరాల సాయంతో రికార్డు చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా 1997లో క్రికెట్లో సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతాన్ని బయటపెట్టింది. దీనిపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఉదంతంతో ‘తెహెల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పేరు మీడియాలో మార్మోగింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2001లో రక్షణ కొనుగోళ్ల వ్యవహారంలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని కూడా ‘స్టింగ్’ ఆపరేషన్ ద్వారా ‘తెహెల్కా’ బట్టబయలు చేసింది. ఆ దెబ్బకు అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వ్యవహారంలో పలువురు రక్షణ శాఖ అధికారులు దోషులుగానూ తేలారు. ‘తెహెల్కా’ జర్నలిస్టు నుంచి నగదు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2012 ఏప్రిల్‌లో వెలువడిన తీర్పులో బంగారు లక్ష్మణ్ ఆ కేసులో దోషిగా తేలారు. కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రక్షణ కొనుగోళ్లలో అవినీతి బాగోతం వెలుగులోకి తేవడంతో తేజ్‌పాల్ మీడియా ప్రపంచంలో మేరునగ ధీరుడి స్థాయికి ఎదిగారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఆయనను అత్యంత ప్రభావవంతుల జాబితాల్లో చేర్చాయి. ‘స్టింగ్’ జర్నలిజంలో తేజ్పాల్ను ఒక బ్రాండ్‌గా అభివర్ణించాయి. చివరకు, తన కూతురి స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో చిక్కుకోవడంతో ఆయన ప్రతిష్ట దారుణంగా దిగజారింది. పతన పరిణామం...: అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా తనకు లభించిన ప్రచారాన్ని తేజ్‌పాల్ తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. తన ప్రచురణలు, వెబ్సైట్ల నిర్వహణ కోసం పలువురు రాజకీయ నాయకుల నుంచి ఆర్థిక సాయం పొందారు. అలాగే, గోవాలో ఇటీవల నిర్వహించిన సదస్సు మాదిరి కార్యక్రమాల నిర్వహణ కోసం బడా కార్పొరేట్ సంస్థల స్పాన్సర్‌షిప్‌ను కూడా పొందారు. తన సంస్థలో పనిచేసే జర్నలిస్టులెవరైనా కొన్ని కార్పొరేట్ స్పాన్సర్లకు వ్యతిరేకంగా కథనాలు తెచ్చిస్తే, వాటిని చెత్తబుట్టపాలు చేసేవారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రచారంలో తప్ప ఆచరణలో తేజ్‌పాల్ నైతిక విలువలకు కట్టుబడని కారణంగా పలువురు ఉద్యోగులు ‘తెహెల్కా’ను విడిచిపెట్టేశారు. అయితే, గోవాలో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి సంఘటనపై గగ్గోలు మొదలయ్యేంత వరకు ఈ ఆరోపణలేవీ పెద్దగా వెలుగులోకి రాలేదు. - సాక్షి, సెంట్రల్ డెస్క్