ఉత్థాన పతనాలు సంచలనమే!
‘స్టింగ్’ పోటుతో అనూహ్యంగా ఎదిగిన తేజ్‌పాల్
లైంగిక దాడి కేసుతో దారుణంగా దిగజారిన ప్రతిష్ట
‘తెహెల్కా’ అంటే సంచలనం అని అర్థం. సంచలనమే ఊపిరిగా మొదలైన ‘తెహెల్కా’ మీడియా సంస్థ దేశంలో పెను సంచలనాలనే సృష్టించింది. మీడియా ‘స్టింగ్’పోటు ఎలా ఉంటుందో దేశంలోని పెద్దతలకాయలకు రుచి చూపింది ‘తెహెల్కా’నే. రహస్య కెమెరాల సాయంతో రికార్డు చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా 1997లో క్రికెట్‌లో సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతాన్ని బయటపెట్టింది. దీనిపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఉదంతంతో ‘తెహెల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పేరు మీడియాలో మార్మోగింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2001లో రక్షణ కొనుగోళ్ల వ్యవహారంలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని కూడా ‘స్టింగ్’ ఆపరేషన్ ద్వారా ‘తెహెల్కా’ బట్టబయలు చేసింది. ఆ దెబ్బకు అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వ్యవహారంలో పలువురు రక్షణ శాఖ అధికారులు దోషులుగానూ తేలారు. ‘తెహెల్కా’ జర్నలిస్టు నుంచి నగదు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2012 ఏప్రిల్‌లో వెలువడిన తీర్పులో బంగారు లక్ష్మణ్ ఆ కేసులో దోషిగా తేలారు. కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రక్షణ కొనుగోళ్లలో అవినీతి బాగోతం వెలుగులోకి తేవడంతో తేజ్‌పాల్ మీడియా ప్రపంచంలో మేరునగ ధీరుడి స్థాయికి ఎదిగారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఆయనను అత్యంత ప్రభావవంతుల జాబితాల్లో చేర్చాయి. ‘స్టింగ్’ జర్నలిజంలో తేజ్‌పాల్‌ను ఒక బ్రాండ్‌గా అభివర్ణించాయి. చివరకు, తన కూతురి స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో చిక్కుకోవడంతో ఆయన ప్రతిష్ట దారుణంగా దిగజారింది.
పతన పరిణామం...: అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా తనకు లభించిన ప్రచారాన్ని తేజ్‌పాల్ తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. తన ప్రచురణలు, వెబ్‌సైట్ల నిర్వహణ కోసం పలువురు రాజకీయ నాయకుల నుంచి ఆర్థిక సాయం పొందారు. అలాగే, గోవాలో ఇటీవల నిర్వహించిన సదస్సు మాదిరి కార్యక్రమాల నిర్వహణ కోసం బడా కార్పొరేట్ సంస్థల స్పాన్సర్‌షిప్‌ను కూడా పొందారు. తన సంస్థలో పనిచేసే జర్నలిస్టులెవరైనా కొన్ని కార్పొరేట్ స్పాన్సర్లకు వ్యతిరేకంగా కథనాలు తెచ్చిస్తే, వాటిని చెత్తబుట్టపాలు చేసేవారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రచారంలో తప్ప ఆచరణలో తేజ్‌పాల్ నైతిక విలువలకు కట్టుబడని కారణంగా పలువురు ఉద్యోగులు ‘తెహెల్కా’ను విడిచిపెట్టేశారు. అయితే, గోవాలో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి సంఘటనపై గగ్గోలు మొదలయ్యేంత వరకు ఈ ఆరోపణలేవీ పెద్దగా వెలుగులోకి రాలేదు.
- సాక్షి, సెంట్రల్ డెస్క్