power agreements
-
విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని
సాక్షి, విజయవాడ: విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను ముంచేశారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గడచిన ఏడాది కాలంలో 30 వేల కోట్ల రూపాయలపైగా ఇచ్చామని చెప్పారు. (చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. 7 వేలకుపైగా జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు అంతా అవినీతిమయమేని మంత్రి బాలినేని దుయ్యబట్టారు.(చదవండి: ‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’) -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్‌పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్‌పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్‌ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్‌లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
సత్రం భోజనం.. పెద్దారెడ్డి రికమండేషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల ముసుగులో టీఆర్ఎస్ సర్కారు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం అక్రమాలకు తెర తీసిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో అత్యంత అవినీతి దాగుందన్నారు. విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై శ్వేతపత్ర విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘డిస్ట్రిబ్యూషన్లకు ఐఏఎస్‌లను కాకుండా, కేసీఆర్ సన్నిహితులను నియమించుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఆయనతో చర్చకు కాంగ్రెస్ సిద్ధం. గోల్మాల్ ఒప్పందాలతో ఒక సంస్థకు ప్రభుత్వం రూ. 957 కోట్లు చెల్లించింది నిజం కాదా? కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్‌లు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్‌లను తప్పించింది వాస్తవం కాదా? ప్రభుత్వం ఐఏఎస్‌ల స్థానంలో అర్హతలేని అధికారులను నియమించడం ద్వారా తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్మాల్ ఒప్పందాలే. నాడు కాంగ్రెస్ ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా నేడు మిగులు విద్యుత్ సాధ్యమైంది. విద్యుత్ మిగులు, సరఫరాలో కేసీఆర్ సాధించింది శూన్యం. ఏపీలో అదనపు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? తెలంగాణలో విద్యుత్ సరఫరా చూస్తుంటే.. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్లుంద’ని రేవంత్ ఎద్దేవా చేశారు. నీ బతుకెంటో తెలుసుకో.. కాంగ్రెస్ పార్టీని తిడుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ముందు తన బతుకేంటో తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారంటే తాము నమ్మలేమన్నారు. గతంలో నకిలీ అవార్డులు తీసున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంకు ఉందని ఆరోపించారు. ఉత్తమ్‌కు అభినందనలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రేవంత్ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. -
'ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామికం'
హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోఅధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో కూడా కలవడానికే కూడా సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. ప్రజల, హక్కులను, స్వేచ్ఛను హరించేవిధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి విధానాలతో నవతెలంగాణ నిర్మాణం జరపలేరన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని జైపాల్‌రెడ్డి అన్నారు.