power distribution corporation ltd.
-
నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తం చేసి గాలికొదిలేసింది. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదుకుంది. రైతులతోపాటు వివిధ వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మన విద్యుత్ సంస్థలను ఆదర్శంగా తీసుకునేలా రాష్ట్ర విద్యుత్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులను, రికార్డులను సొంతం చేసుకుంటోంది. అలాంటి విద్యుత్ సంస్థలకు ‘కోతలు వద్దు.. నిధులు అడగొద్దు’ అని ప్రభుత్వం చెప్పినట్టుగా ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని వండివార్చింది. ఈ ఎల్లో కథనాన్ని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. ‘ఈనాడు’ అచ్చేసినట్లు నిధులు అడగొద్దని ప్రభుత్వం తమకేమీ చెప్పలేదని తేల్చిచెప్పారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురు సీఎండీలు బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ♦ ఈనాడు తన కథనంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నిధులు అడగొద్దు అని చెప్పినట్లుగా పేర్కొనడాన్ని ఖండిస్తున్నాం. ఈ కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక మద్దతును ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) దాదాపు రూ.6 వేల కోట్లను ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి ఉండగా ఆ మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా చెల్లించింది. ♦ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందించడం డిస్కంల బాధ్యత. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావలసినంత విద్యుత్ రాకపోవడం, ఈ సీజన్లో మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వేసవి ఎండలతో ఉక్కపోత వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వినియోగదారులు వాడుతున్నదానికి తగ్గట్టు విద్యుత్‌ను సమకూర్చుకోవాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంత ధరైనా వెచ్చించి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సి వచ్చింది. ఈ కొనుగోళ్లు అన్ని పారదర్శక పోటీ బిడ్డింగ్ విధానంలో విద్యుత్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీప్ (డీఈఈపీ) ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా జరిగాయి. ♦ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన సమయానికి (అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) విద్యుత్ సరఫరాలో ఏవిధమైన అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) సూచనల మేరకు దాదాపు 3,830 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక కొనుగోలు ద్వారా సేకరించడానికి ప్రణాళిక రూపొందించాం. ♦ ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీలు అనేవి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వసూలు చేస్తున్నాం. నెలవారీ అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం యూనిట్ రూ.0.40 వరకే వసూలు చేసుకోవడానికి కమిషన్ అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ సర్దుబాటు చార్జీలు వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో కనిపిస్తున్నాయి. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 269 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 269 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. 155 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 114 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. పూర్తి వివరాలను ఈ నెల 20న లేదా ఆ తర్వాత www.tssouthernpower.com వెబ్సైట్లో పొందుపరచనున్నామని తెలిపింది. 155 ఏఈ పోస్టుల్లో 133 ఏఈ (ఎలక్ట్రికల్), 20 ఏఈ (సివిల్) పోస్టులున్నాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో సైతం 1,843 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన జారీ కానుంది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 ఏఈ, 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జేఎల్ఎం పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటనలు జారీ చేయగా, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. -
కట్టకుంటే కరెంట్ కట్
ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగానే కరెంటు ఇస్తున్నా, రైతుల నుంచి కస్టమర్ చార్జీలను వసూలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుండడంతో ఈ ఏడాదికి సంబంధించిన కస్టమర్చార్జీల బకాయిలను వందశాతం వసూలు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. దీంతో చార్జీలను చెల్లించని రైతులకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మోర్తాడ్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఉచితంగానే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా రైతుల నుంచి కస్టమర్ చార్జీలను వసూలు చేయడం కొనసాగుతోంది. వారం రోజుల్లో 2013 సంవత్సరం ముగిసిపోతుండటంతో ఈఏడాదికి సంబంధించిన కస్టమర్ చార్జీలను వంద శాతం వసూలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కొత్త ఏడాది ఆరంభానికి గడువు సమీపిస్తుండటంతో పాత సంవత్సరానికి సంబంధించిన కస్టమర్ చార్జీలను వసూ లు చేయడానికి క్షేత్ర స్థాయి ఉద్యోగులు రం గంలోకి దిగారు. చార్జీలను చెల్లించని రైతుల కు కరెంటు సరఫరా నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వినియోగించుకుంటున్న ప్రతి రైతు నుంచి కస్టమర్చార్జీలను వసూలు చేసి సంస్థ ఆదాయాన్ని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌పై నెలకు 30 చొప్పున ఏడాదికి 360 వసూలు చేస్తున్నారు. సాధారణంగా జనవరి నుంచి జూన్ నెల వరకు *180, జూలై నుంచి డిసెంబర్ వరకు మరో 180 వసూలు చేయాల్సి ఉంది. కాగా ఖరీఫ్ సీజను ముగిసిన తరువాతనే రైతుల చేతిలో డబ్బు ఉంటుంది. దీంతో ఆరు నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి సంబంధించిన కస్టమర్ చార్జీలను ఒకే సారి వసూలు చేస్తున్నారు. 3 కోట్ల వరకు బకాయిలు జిల్లాలోని 36 మండలాల్లో 2,05,079 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కనెక్షన్‌కు 360 చొప్పున జిల్లాలో వసూలు లక్ష్యం 7,38,28,440గా నిర్ణయించారు. గతేడాదికి సంబంధించిన బకాయిలు *3 కోట్ల వరకు ఉన్నాయి. గడచిన సంవత్సరంలో వర్షాలు సరిగా కురవక పోవడంతో రైతులు అనుకున్నంతగా పంటలను సాగు చేయలేక పోయారు. దీంతో కస్టమర్ చార్జీలను రైతులు చెల్లించక పోవడంతో ఎన్పీడీసీఎల్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ సంవత్సరం ఆశించినదానికంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో రైతులు సమృద్ధిగా పంటలను పండించారు. రైతుల నుంచి ఎలాగైనా కొత్త చార్జీలతో పాటు పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులు గట్టిగా చెబుతున్నారు. కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరికలు ఏడీఈ, ఏఏఈ, సబ్‌ఇంజినీర్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్, హెల్పర్ స్థాయి ఉద్యోగులు తెల్లవారు నుంచి గ్రామాల్లో తిరుగుతూ కస్టమర్ చార్జీల వసూలుకు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ చార్జీలు చెల్లించకుంటే ట్రాన్స్ఫార్మర్ల ఫీజులను తొల గిస్తున్నారు. అంతేగాక రైతుల ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. వందశాతం వసూలు లక్ష్యంగా ఉద్యోగులు పని చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా కస్టమర్ చార్జీలను వసూలు చేయని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండటం అటు రైతులు సహకరించక పోవడంతో ఇరువురి మధ్య తాము ఇబ్బందులు పడుతున్నామని క్షేత్ర స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.