నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు  | Eenadu false writings on discoms | Sakshi
Sakshi News home page

నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు 

Published Thu, Oct 5 2023 4:50 AM | Last Updated on Thu, Oct 5 2023 4:50 AM

Eenadu false writings on discoms - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తం చేసి గాలికొదిలేసింది. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్‌ సంస్థలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదుకుంది. రైతులతోపాటు వివిధ వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మన విద్యుత్‌ సంస్థలను ఆదర్శంగా తీసుకునేలా రాష్ట్ర విద్యుత్‌ రంగం జాతీయ స్థాయిలో అవార్డులను, రికార్డులను సొంతం చేసుకుంటోంది. అలాంటి విద్యుత్‌ సంస్థలకు ‘కోతలు వద్దు.. నిధులు అడగొద్దు’ అని ప్రభుత్వం చెప్పినట్టుగా ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని వండివార్చింది.

ఈ ఎల్లో కథనాన్ని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. ‘ఈనాడు’ అచ్చేసినట్లు నిధులు అడగొద్దని ప్రభుత్వం తమకేమీ చెప్పలేదని తేల్చిచెప్పారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురు సీఎండీలు బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే...

ఈనాడు తన కథనంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థలను నిధులు అడగొద్దు అని చెప్పినట్లుగా పేర్కొనడాన్ని ఖండిస్తున్నాం. ఈ కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు టారిఫ్‌ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక మద్దతును ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగానికి (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) దాదాపు రూ.6 వేల కోట్లను ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి ఉండగా ఆ మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా చెల్లించింది.  

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వినియోగదారులకు 24 గంటల విద్యుత్‌ అందించడం డిస్కంల బాధ్యత. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావలసినంత విద్యుత్‌ రాకపోవడం, ఈ సీజన్‌లో మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వేసవి ఎండలతో ఉక్కపోత వల్ల విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. వినియోగదారులు వాడుతున్నదానికి తగ్గట్టు విద్యుత్‌ను సమకూర్చుకోవాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంత ధరైనా వెచ్చించి స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు చేయాల్సి వచ్చింది. ఈ కొనుగోళ్లు అన్ని పారదర్శక పోటీ బిడ్డింగ్‌ విధానంలో విద్యుత్‌ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీప్‌ (డీఈఈపీ) ఈ–బిడ్డింగ్‌ పోర్టల్‌ ద్వారా జరిగాయి.

  సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన సమయానికి (అక్టోబర్‌ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) విద్యుత్‌ సరఫరాలో ఏవిధమైన అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) సూచనల మేరకు దాదాపు 3,830 మిలియన్‌ యూనిట్లను స్వల్పకాలిక కొనుగోలు ద్వారా సేకరించడానికి ప్రణాళిక రూపొందించాం.

   ఇంధన, విద్యుత్‌ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీలు అనేవి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వసూలు చేస్తున్నాం. నెలవారీ అదనపు విద్యుత్‌ కొనుగోలు వ్యయం ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం యూనిట్‌ రూ.0.40 వరకే వసూలు చేసుకోవడానికి కమిషన్‌ అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ సర్దుబాటు చార్జీలు వినియోగదారుల విద్యుత్‌ బిల్లుల్లో కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement