పవర్ పంచ్!
సాక్షి, హైదరాబాద్: ఏసీలో కూర్చొంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాలి కానీ.. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం చూస్తే విద్యుత్ ఇంజనీర్లకు అప్పుడే ముచ్చెమటలు పడుతున్నాయి. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డు అవుతోంది. గత నెలలో రోజు సగటు విద్యుత్ వినియోగం 42 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం 49 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60 ఎంయూలు దాటే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే పలు ఫీడర్లు తరచూ ట్రిప్పవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అనధికారిక కోతలపై ముందస్తు సమాచారం లేకపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరెలా ఉండనుందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 54 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 44 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనె క్షన్లు ఉన్నాయి.
మరో 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లు 306, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 96882, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎలీ్టలైన్స్ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సిగూడ, సరూర్‌నగర్, సైబర్‌సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్స్ కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 1538 మెగవాట్ల విద్యుత్ వినియోగం ఉండేది. అంతే కాదు ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో మాత్రమే కని్పంచే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారమయ్యాయి. కొత్త కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో వినియోగం రెట్టింపైంది.
గృహ వినియోగమే అధికం
ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఈసారి పారిశ్రామిక వినియోగం తగ్గింది. గృహ వినియోగం పెరిగింది. గ్రేటర్లో 24 పారిశ్రామిక వాడలు ఉండగా, వీటిలో సుమారు 4 లక్షల యూనిట్లు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం డిస్కం పరిధిలో 150 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున 48 నుంచి 49 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. దీనిలో 45 నుంచి 50 శాతం అంటే సుమారు 24 ఎంయూల విద్యుత్ పరిశ్రమలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మిగిలినది గృహ, ఇతర వాణిజ్య అవసరాలకు ఖర్చు అవుతుంది. గత ఏడాదితో పోలిస్తే నగరంలో ప్రస్తుతం చలి తీవ్రత తగ్గడం, రాత్రి పూట ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ఉపశమనం కోసం సిటిజన్లు ఏసీలు, ఫ్యాన్లను వాడుతున్నారు. ఉ దయం వేడినీళ్ల కోసం వాటర్ హీటర్ల, గ్రీజర్ల వినియోగం పెరిగింది. నిజానికి ఈ లెక్కన విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే మరింత పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తక్కువ వినియోగానికి పారిశ్రామిక, వాణిజ్య కరెంట్ వినియోగం తగ్గడమే ఇందుకు కారణమని డిస్కం ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.