తండాకు కరెంట్ షాక్.. వివాహిత మృతి
రేగోడ్: అధికారుల నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం.. మూడు రోజులుగా ఆ తండాలో ఇంటింటికీ కరెంట్ షాక్ వస్తుండగా.. ఐదుగురు గాయపడ్డారు. అయినా విద్యుత్ అధికారులు పరిస్థితి చక్కదిద్దకపోవడంతో నిండు ప్రాణం బలైంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం దుద్యాల పంచాయతీ పరిధి మంచిర్యాల గిరిజన తండాకు చెందిన సురేఖ (25) మూడు రోజుల క్రితం నారాయణఖేడ్‌లోని పుట్టింటికి వెళ్లింది.
శనివారం మంచిర్యాల తండాకు వచ్చింది. తండాలో 3 రోజులుగా కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు గాయపడ్డారని ఆమెకు తెలియదు. ఇంటి ముందున్న కరెంటు స్తంభం నుంచి ఓ కర్రకు బిగించిన ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా సురేఖకు షాక్ కొట్టింది. స్థానికులు రక్షించే లోపే సురేఖ ప్రాణం కోల్పోయింది. దీంతో భర్త, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దీనిపై విద్యుత్ ఏఈ మోహన్‌ను వివరణ కోరగా.. తండాలో శనివారం మాత్రమే కరెంట్ షాక్ వచ్చిందన్నారు.