మురికివాడలు, అనధికార కాలనీలపై దృష్టి
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలదళం ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా విజయాన్ని ప్రభావితం చేసే ఓటుబ్యాంకు ప్రాంతాలైన మురికివాడలు, అనధికార కాలనీల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టింది.
న్యూఢిల్లీ: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నగర పరిధిలోని మురికివాడలు, అనధికార కాలనీలపై దృష్టి సారించింది. ఈ రెండు ప్రాంతాల్లో గరిష్టస్థాయిలో సభ్యత్వాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించింది. ఈ విషయమై ఆ పార్టీ నగర శాఖ ఇంచార్జి ప్రభాత్ ఝా మాట్లాడుతూ ‘బీజేపీలో మమేకం కావాలని సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలను కోరుతున్నాం. జుగ్గీజోపిడీ క్లస్టర్లు, మురికివాడలతోపాటు అనధికార కాలనీల్లో జోరుగా సభ్యత్వం చేయించాలని మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించాం. గత కొద్ది నెలలుగా తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా వారికి వివరించాలని సూచించాం. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీనాటికి మొత్తం 15 లక్షలమందిని సభ్యులుగా చేర్చుకోవాలనేది మా లక్ష్యం’అని అన్నారు.
కార్యకర్తలు, నాయకులకు ప్రోత్సాహకాలు
వందకుపైగా సభ్యులను చేర్చినవారికి బీజేపీ అధిష్టానం కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. వందమంది సభ్యులను చేర్చినవారిని చురుకైన కార్యకర్తల జాబితాలో చేర్చనుంది. వీరికి తగిన గుర్తింపు కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు తెలియజేశారు. ‘వందకుపైగా సభ్యత్వాలు చేయించినవారికి చురుకైన కార్యకర్తలుగా గుర్తిస్తాం. ఇది వారికి ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇందువల్ల మిగతా కార్యకర్తలు స్ఫూర్తి పొందుతారు. మరింతమందిని సభ్యులుగా చేర్పించేందుకు యత్నిస్తారు’అని అన్నారు.
అత్యధిక శాతంమంది వలసకూలీలే
కాగా మురికివాడలు, అనధికార కాలనీల్లో నివసించేవారిలో అత్యధిక శాతం మంది వలస కూలీలే. వీరి ఆదాయం అంతంతగానే ఉంటుంది. ఇటువంటివారితో ‘జన్ ధన్’ బ్యాంకు ఖాతాలను తెరిపించాలని బీజేపీ బావిస్తోంది. ఇదే విషయమై ఆ పార్టీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన జన్ ధన్’ బ్యాంకు ఖాతావల్ల ఎంతో లబ్ధి కలుగుతుంది. వారికి బీమా వెసులుబాటు కలుగుతుంది. వారి సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాల్లో అతి పెద్దది ఇదే. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి వివరిస్తున్నాం’ అని అన్నారు.
మురికివాడల క్రమబద్ధీకరణ పథకం
ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశమున్న నేపథ్యంలో అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు సంబంధించి ఓ పథకాన్ని ప్రకటించాలని యోచిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు మాట్లాడుతూ ‘ఇటువంటి ఓ పథకాన్ని ప్రకటించినట్టయితే ఆప్ ఓటుబ్యాంకుకు గండిపడుతుంది. విధానసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మురికివాడల్లో నివసించేవారి విశ్వాసాన్ని చూరగొనాల్సి ఉంటుంది. ’అని అన్నారు. ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.