2050 నాటికి దేశంలో...70 లక్షల ఉద్యోగాలు కనుమరుగు
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగేళ్ల నుంచీ ప్రతీ రోజూ 550 చొప్పున ఉద్యోగాలు కనుమరుగవుతున్న విషయం తెలుసా...? ఇదే విధమైన ధోరణి కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం ఉందట. దేశంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన సివిల్ సొసైటీ గ్రూపు ‘ప్రహార్’ నిర్వహించిన అధ్యయనంలో విధాన రూపకర్తలను, నిరుద్యోగులను కలవరపెట్టే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.
రైతులు, రిటైల్ వర్తకులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు ఎక్కువగా ప్రభావితమైన వర్గాలని, ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో జీవనోపాధి ముప్పును ఎదుర్కొంటున్నారని ప్రహార్ సంస్థ తెలిపింది.
2016 ప్రారంభంలో కేంద్ర కార్మిక బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం చూస్తే 2015లో దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 1.35 లక్షలుగానే ఉన్నాయి. కానీ ఈ సంఖ్య 2013లో 4.19 లక్షలు, 2011లో 9 లక్షలుగా ఉందన్న విషయాన్ని గమనించాలి.
దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోగా రోజూ 550 చొప్పున తరిగిపోతున్నాయి. ఇలానే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరిస్తాయి. దేశ జనాభా అదనంగా 60 కోట్ల మేర వృద్ధి చెందుతుంది.
‘దీన్ని బట్టి చూస్తే దేశంలో ఉద్యోగాల సృష్టి అన్నది తగ్గిపోతుందని తెలుస్తోంది. ఇది చాలా కలవరపెట్టే అంశం.
వ్యవస్థీకృత రంగం అందించే ఉపాధి నామమాత్రంగా ఉంటోంది. ఈ రంగం కల్పించే ఉపాధి అవకాశాలు ఒక శాతం కంటే తక్కువే. వ్యవస్థీకృత రంగంలో 3 కోట్ల ఉద్యోగాలు ఉంటే, అవ్యవస్థీకృత రంగంలో 44 కోట్ల ఉద్యోగాలున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది.
తిరిగి మూలాలకు వెళ్లాలని... ప్రస్తుతం 99 శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగాలైన వ్యవసాయం, చిల్లర దుకాణాలు, సూక్ష్మ, చిన్న స్థాయి సంస్థలను కాపాడే చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ రంగాలకు ప్రభుత్వ సాయం కావాలేగానీ నియంత్రణలు కాదని... 21వ శతాబ్దంలో దేశానికి కావాల్సింది స్మార్ట్ గ్రామాలేగానీ, స్మార్ట్ సిటీలు కాదని అధ్యయనం హితవు పలికింది.