prajachaitanya yarta
-
నేతల నోట.. ‘నాయిని’ మాట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రజా చైతన్యయాత్ర బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి రాష్ట్ర నేతలు హామీలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సభలో ప్రసంగించిన నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి భవిష్యత్ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా వేదికపైనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దీంతో పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘కష్టకాలంలో పనిచేసిన ఎవ్వరీని మర్చి పోం. నాలుగేళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా పటిష్టంగా ఉందో చూస్తున్నాం. రాజేందర్‌రెడ్డిలాంటి నేతలు కేసులకు వెరవకుండా కష్టపడి పని చేశారు. వారి కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తాం’ అని హామీ ఇచ్చారు. అంతకు ముందు వీహెచ్ మాట్లాడుతూ చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. వాళ్లను రమ్మనండి, కానీ పార్టీ జెండాలను మోసే వాళ్లను గుర్తించాలి. కేసులను ఎదుర్కొని నిలబడ్డ రాజేందర్‌రెడ్డిలాంటి వాళ్లను పార్టీ గుర్తించాలి. వచ్చీ రాంగనే కుర్చీల కూసుంటనంటే కుదరదు’ అని వేదికపైనే అన్నారు. ఆ తర్వాత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ నాయిని రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే చేద్దామా ? వద్దా ? అని సభికులను ప్రశ్నించారు. నాయినికి టిక్కెట్ ఇవ్వాలంటూ వేదిక మీద నుండే నేరుగా పార్టీ పెద్దలను అడుగుతున్నానని చెప్పారు. ఈ విషయంపై నేరుగా సోని యాగాంధీతో మాట్లాడుతానన్నారు. జెండా మోశా డు.. కష్టపడ్డాడు.. ఖర్చుపెట్టాడు.. అతడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని చెప్పారు. చివర్లో శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నడిపించిన రాజేందర్‌రెడ్డికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చివరగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారని, తనకు అత్యంత సన్నిహితులైన వేం నరేందర్‌రెడ్డి, సీతక్కతో పార్టీలో చేరామని, కాంగ్రెస్‌లో తమకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పడం కొసమెరుపు. -
కాంగ్రెస్ యాత్ర షెడ్యూల్ ఖరారు
వరంగల్ : జిల్లాలో జరిగే రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కాగా.. వచ్చే నెల మూడు నుంచి పదో తేదీ వరకు జరిగే బస్సు యాత్ర షెడ్యూల్‌ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. ఏప్రిల్ 3న భూపాలపల్లి నియోజకవర్గంలో బస్సు యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. 4న మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. సాయంత్రం 6గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో బస చేస్తారు. 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గంలో, సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. అనంతరం నైట్‌హాల్ట్ చేస్తారు. 8వ తేదీన డోర్నకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. నైట్‌హాల్ట్ భద్రాచలంలో చేస్తారు. 9వ తేదిన మణుగూరు మీదుగా ములుగు నియోజకవర్గంలో యాత్ర చేసి సాయంత్రం 5 గంటలకు సభలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు. 10వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుందని రాజేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, బలరాంనాయక్, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిశీలకులు సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, నేరేళ్ల శారద, బట్టి శ్రీను, పులి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాచైతన్యం కోసమే అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
కర్నూలు: జిల్లాలో ప్రజాచైతన్యం కోసం అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. శనివారం మధ్యాహ్నం సి.క్యాంప్ సెంటర్లోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో సీఐలు కృష్ణారెడ్డి, సీతారామరావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీజీపీ సాంబ శివరావు ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4వ తేదీన పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు, 5వ తేదీన ప్రజలకు చైతన్య సదస్సులు, 6వ తేదీన కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలు వివిధ అంశాలపై నిర్వహిస్తామన్నారు. అవినీతి నిర్మూలన–యువత పాత్ర అనే అంశంపై పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థినీ, విద్యార్థులకు వారోత్సవాల ముగింపు రోజు 9వ తేదీన కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామన్నారు. 7వ తేదీన అవినీతికి వ్యతిరేకంగా సి.క్యాంప్ సెంటర్లోని కార్యాలయం నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అవినీతి వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసి పెట్టేందుకు మామూళ్లు అడిగినా, లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా తమకు ఫిర్యాదు చేయవచ్చని, అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అవినీతి వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అవినీతి అధికారుల గురించి సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు... మహబూబ్ బాషా, ఏసీబీ డీఎస్పీ – 94404 46178 కృష్ణారెడ్డి, సీఐ – 94404 46129 సీతారామ రావు, సీఐ – 94906 11022