ప్రజాచైతన్యం కోసమే అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
Published Sun, Dec 4 2016 12:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM
కర్నూలు: జిల్లాలో ప్రజాచైతన్యం కోసం అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. శనివారం మధ్యాహ్నం సి.క్యాంప్ సెంటర్‌లోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో సీఐలు కృష్ణారెడ్డి, సీతారామరావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీజీపీ సాంబ శివరావు ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4వ తేదీన పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు, 5వ తేదీన ప్రజలకు చైతన్య సదస్సులు, 6వ తేదీన కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలు వివిధ అంశాలపై నిర్వహిస్తామన్నారు. అవినీతి నిర్మూలన–యువత పాత్ర అనే అంశంపై పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థినీ, విద్యార్థులకు వారోత్సవాల ముగింపు రోజు 9వ తేదీన కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామన్నారు. 7వ తేదీన అవినీతికి వ్యతిరేకంగా సి.క్యాంప్ సెంటర్‌లోని కార్యాలయం నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అవినీతి వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసి పెట్టేందుకు మామూళ్లు అడిగినా, లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా తమకు ఫిర్యాదు చేయవచ్చని, అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అవినీతి వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
అవినీతి అధికారుల గురించి సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు...
మహబూబ్ బాషా, ఏసీబీ డీఎస్పీ – 94404 46178
కృష్ణారెడ్డి, సీఐ – 94404 46129
సీతారామ రావు, సీఐ – 94906 11022
Advertisement