తెగనమ్మేకన్నా తిరిగి వాడటం మిన్న!
పండ్ల తోటల్లో వాడి.. తీసేసిన లేటరల్ పైపులను తెగనమ్ముకుంటున్న రైతులు వీటిని ఇతర పంటల్లో పునర్వినియోగానికి తోడ్పడుతున్న స్వచ్ఛంద సంస్థలు రైతులు ఉపయోగించే బిందు సేద్య పరికరాలు, లేటరల్స్ పదేళ్లు పనిచేస్తాయని అంచనా.అయితే, కొన్ని పండ్ల తోటల్లో వేసినవి వివిధ కారణాల వల్ల నాలుగైదేళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని తిరిగి ఇతర పంటల్లో వాడుకోవడం ఎలాగో తెలియకపోవడంతో.. కొందరు రైతులు లేటరల్ పైపులను అతి తక్కువ ధరకే పాత సామాను వ్యాపారులకు అమ్మేస్తూ తీవ్రంగా నష్టపడుతున్నారు.
అయితే, పండ్ల తోటల్లో వాడి తీసేసిన లేటరల్ పైపులకు స్వల్ప మార్పులు, చేర్పులు చేసి, ఇతర పంటల సాగుకు కొన్నేళ్లపాటు చక్కగా తిరిగి వినియోగించుకునే మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 5 ఎకరాల పండ్ల తోటల్లో వాడిన లేటరల్ పైపులకు కొన్ని మార్పులు చేసి ఒక ఎకరంలో ఆరుతడి, కూరగాయ పంటలకు వాడుకోవచ్చు. లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకోవడంలో రైతులకు సుస్థిర భూగర్భజల యాజమాన్యం (సుగమ్) ప్రాజెక్టు ఉపయోగపడుతోంది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సీడబ్ల్యూఎస్), రిడ్స్ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామ రైతులు లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకుంటున్నారు.
కోటంకలో రైతులు 450 ఎకరాల్లో 54 వేల చీనీ చెట్లను పెంచారు. కొన్నేళ్ల తర్వాత బోర్లు ఎండిపోయి ఎంతో ఆశతో పెంచుకున్న చెట్లను విధిలేక నరికేశారు. 5 ఎకరాల్లో రూ.75 వేలతో అమర్చుకున్న లేటరల్ పైపులను, పరికరాలను రూ.4,500కే అమ్మేశారు. దాచి ఉంచుకున్న కొద్దిమంది రైతులు మాత్రం స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వీటిని కూరగాయ పంటలకు అనువుగా మార్చి వాడుకుంటున్నారు. అప్పటికే తోటలు ఎండిపోయి నష్టపోయి ఉన్న రైతులు ఈ లేటరల్స్‌ను వేరే పంటలకు వాడుకోవాలంటే మరికొంత ఖర్చవుతుంది. అయితే, ఈ ఖర్చులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు (కొన్ని జిల్లాల్లో మాత్రమే) చెల్లిస్తుండడం రైతులకు ఊరట కలుగుతోంది. ఇలా లబ్ధిపొందిన కోటంకకు చెందిన రైతుల్లో వై.రామలింగారెడ్డి(94900 29375) ఒకరు.
ఆయన ఇలా చెప్పారు: ‘బోరు కింద 5 ఎకరాల్లో చీనీ (బత్తాయి) మొక్కలు నాటి. బిందు సేద్య పరికరాలను సబ్సిడీపై తీసుకొని అమర్చాను. బోరులో నీరు తగ్గిపోవటం, తెగులు సోకడంతో చీనీ చెట్లను నరికి వేశా. 5 ఎకరాల పండ్ల తోటలో వాడిన లేటరల్ను 1 ఎకరంలో కూరగాయ పంటలకు తిరిగి వేసుకోవడానికి ‘సుగమ్’ ప్రాజెక్టు సిబ్బంది తోడ్పడ్డారు. ఖర్చులో రూ.10,328ను సీడబ్ల్యూఎస్ సంస్థ ఇవ్వగా, మరో రూ.4,450లు నేను భరించాను. బటన్ డ్రిప్పర్లు వాడితే ఈ ఖర్చు తగ్గుతుంది. మరో పది మంది రైతులు కూడా లేటరల్ పైపులను తిరిగి వాడుకుంటున్నారు..’
- జె.ఆదినారాయణ, న్యూస్‌లైన్, గార్లదిన్నె, అనంతపురం
పాత లేటరల్స్ వాడకంపై శిక్షణ
రైతు దగ్గర ఉన్న పాత లేటరల్ పైపులను తిరిగి ఇన్స్టాల్ చేయడానికి మా సంస్థ ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తుంది. వీటిని తిరిగి ఇన్స్టాల్ చేయడానికి అవసరమైన ఇతర పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేలు ఖర్చవుతుంది. అనంతపురం, వరంగల్ జిల్లాల్లో రైతులకైతే ఈ ఖర్చులో కొంత భాగాన్ని మా సంస్థ ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఇతర జిల్లాల రైతులకు ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. రైతుల దగ్గరున్న పాత లేటరల్ పైపులను ఉచితంగానే ఇన్స్టాల్ చేయిస్తాం. అయితే, ప్రస్తుతం ఇన్స్టాల్ చేసే నిపుణుల కొరత ఉంది. దీనిపై యువ రైతులు, గ్రామీణ యువకులకు 2 రోజుల శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. శిక్షణ పొందదల చిన వారు సంప్రదించాల్సిన చిరునామా: సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సుగమ్ ప్రాజెక్టు), 12-13-451, వీధి నం:1, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906
- పి. రజనీకాంత్ (98495 75147),
సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ‘సుగమ్’ ప్రాజెక్టు