రైతాంగం నోట్లో మట్టి
♦ ‘ప్రాణహిత’ రీడి జైన్‌తో జిల్లాకు అన్యాయం
♦ పాలమూరు పేరిట కపట నాటకం ఆడుతున్నారు
♦ మెదక్ జిల్లా కోసమే సీఎం ఇదంతా చేస్తున్నారు
♦ ‘సాక్షి’తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చేవె ళ్ల- ప్రాణహిత ప్రాజెక్టును రద్దుచేసి రైతాంగం నోట్లో మట్టికొట్టిన కేసీఆర్‌ను జిల్లా ప్రజలు క్షమించరని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేస్తాననే మాయమాటలతో జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్వార్థపూరిత కుట్రలకు రంగారెడ్డి జిల్లాను బలి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో సబిత మాట్లాడారు. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా పాలమూరు నీటిని తరలిస్తామని చెబుతున్న సర్కారు.. ఇటీవల ఖరారు చేసిన ప్యాకేజీల్లో జిల్లాను ఎందుకు చేర్చలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం సర్వే ప్రక్రియ కూడా పూర్తి కాని ఈ ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను మభ్యపెట్టడమేనని అన్నారు. కృష్ణానదీపై ఇప్పటికే ప్రాజెక్టులు, నీటి లభ్యతపై స్పష్టమైన ప్రకటన చేయకుండా.. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలతో కృష్ణమ్మను పారిస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నదీజలాల వినియోగంపై అంతరాష్ట్ర వివాదాలున్నాయని, నీటి లభ్యత కూడా అంతగాలేని ఈ ప్రాజెక్టును నమ్ముకోవడం కన్న గోదావరి జ లాలను జిల్లాకు తరలించడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దురదృష్టకరమన్నారు.
డిండితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలను స్థిరీకరిస్తామని ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నారు. ఈ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారని, ఈ పరిణామాల మధ్య డిండి నీరు జిల్లాకు తరలించడం అనుమానమేనన్నారు. గోదావరి న దీజలాల్లో 5 టీఎంసీల వాటా రంగారెడ్డి జిల్లాకు ఉందని, ఈ నీటిని కూడా సొంత జిల్లాకు కేసీఆర్ తరలించుకోవడం దారుణమన్నారు. మెదక్ జిల్లా అంతటికి గోదావరి నీళ్లు వచ్చేలా ప్రాజెక్టుకు రీడిజైన్ చేసిన సీఎం.. పక్కనే ఉన్న రంగారెడ్డికి వచ్చేసరికి నీటి తరలింపు అసాధ్యమని ప్రక టించడం దగా చేయడమేనన్నారు. జలవిధానంపై అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై అధికారపార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ప్రజల అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.