Prati Roju Pandage
-
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
సాయిధరమ్ తేజ్ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలించింది. ఈ నేపథ్యంలో, సాయితేజ్ కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. (చదవండి : ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ) ‘ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ సందేశం పంపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ, మాటలు రావడం లేదని ట్వీట్ చేశాడు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుందని, ‘లవ్యూ పవన్ కల్యాణ్ మామ’ అంటూ ట్వీట్ చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న విడులైంది. సాయితేజ్‌కు జంటగా రాశిఖన్నా నటించింది. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. Falling short of words...and thank you seems to be too small of a word right now...love you @PawanKalyan mama ❤️🤗😘 #prathirojupandaage pic.twitter.com/CxrQbMDodm — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 13, 2020 -
అదంతా సహజం
సినిమా: అదంతా సహజం అంటోంది నటి రాశీఖన్నా. అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయంటారు. తాద్వారా మార్పులు వస్తాయి. నటి రాశీఖన్నా ఇందుకు మినహాయింపు కాదట. ఈ హైదరాబాదీ బ్యూటీ బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పుడు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉంది. ఇమైకా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడికి ఇక్కడ వెంట వెంటనే నాలుగైదు అవకాశాలు వచ్చేశాయి. అలా అడంగమరు. సంఘ తమిళన్ వంటి చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇక్కడ రాశి గల నటిగానే పేరు తెచ్చుకుంది. అయినా చేతిలో ఇప్పుడు ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. బహుశా తెలుగులో అవకాశాలు వరుస కట్టడంతో తమిళ చిత్రాలకు గ్యాప్ ఇచ్చిందేమో. తెలుగులో తను నటించిన ప్రతిరోజూ పండగే మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మంచి జోరు మీదున్న రాశీఖన్నా నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఒక్కో రోజూ ఇంకా మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. నిన్న కంటే నేడు ఇంకా కొంచెం ఎక్కువగా శ్రమించాలి. అందుకోసం మనం మనతోనే పోటీ పడాలి. ఇప్పుడు నేనదే చేస్తున్నాను. నటిగా పరిచయమై 7 ఏళ్లు అయ్యింది. ఈ ఏడేళ్లలో వివిధ కథా పాత్రల్లో నటించాను. ఆ విధంగా తన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా నిర్ణయాలను కూడా చాలా మార్చుకున్నాను. అంతాగా నేను పోషించిన పాత్రలు నాపై ప్రభావం చూపాయి. నా ఆలోచనా పరిధి పెరిగింది. సినిమాల్లో జయాపజయాలు సహజం. ఇంతకు ముందు విమర్శనలపై ఎంటనే రియాక్ట్ అయ్యేదాన్ని. నా చిత్రాల అపజయాల గురించి ఎవరైనా విమర్వించినా, గాసిప్స్ రాసినా కోపం వచ్చేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయ్యింది. చాలా శాంతస్వభావిగా మారిపోయాను. నిన్నటి కంటే నేడు బాగుండాలని ప్రయత్నిస్తున్నాను.ఈ కొత్త సంవత్సరంలో నా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. అని నటి రాశీఖన్నా పేర్కొంది. మొత్తం మీద తాను మారిన విషయాన్ని పక్కన పెడితే మాటల్లో మాత్రం బాగా పరిణితి చెందిందీ భామ అని అనిపిస్తోంది కదూ! -
‘ప్రతిరోజూ పండుగే’ న్యూ ఇయర్ పార్టీ
-
ఈ విజయం ఆ ఇద్దరిదే
‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్‌లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్‌ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. సత్యరాజ్‌గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్‌గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్‌మీట్‌ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్. -
నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇది
తూర్పుగోదావరి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘‘ఆరు సినిమాలు వరుసగా ప్లాప్ కాగానే నా కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ మద్దతుతో ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ తన కెరీర్లో నిలిచిపోయే సినిమా అయ్యింది’’ అని ఆ చిత్ర హీరో సాయిధరమ్‌తేజ్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం కళాకేంద్రంలో సాయి ధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి వచ్చానన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు మారుతి తనకు మంచి విజయాన్ని అందించారన్నారు. చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ తాను కృష్ణా జిల్లాలో పుట్టినా గోదావరి జిల్లాలతో తెలియని అనుబంధం ఉందన్నారు. కథ రాసేటప్పుడు రాజమండ్రిలో చిత్ర షూటింగ్ చేయాలని అనుకున్నామన్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్లో చాలా మంది తమ తల్లిదండ్రులను మిస్సవుతున్నారన్న కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తీశామన్నారు. థియేటర్లో నవ్వించడంతో పాటు హృదయాన్ని హత్తుకునేలా మంచి మేసేజ్ ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి, హీరో సాయిధరమ్‌తేజ్‌లు ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందించారన్నారు. తాత పాత్రలో సత్యరాజ్, తండ్రి పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించారన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ చిత్రాన్ని 60 శాతం రాజమహేంద్రవరంలో షూట్ చేశామన్నారు. సినిమా అయిపోయిన తరువాత థియేటర్ల నుంచి బయటకు వచ్చే సమయంలో కొడుకులు వారి తల్లిదండ్రుల చేతులు పట్టుకుని బయటకు రావడం కనిపించిందన్నారు. నటుడు రావు రమేష్ మాట్లాడుతూ సినిమాలో తనకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు మారుతికి తన తల్లి ఉంటే గుడి కట్టేదని అన్నారు. సినిమాలోని తన డైలాగులను చెప్పి కొద్ది సేపు నవ్వించారు. కమెడీయన్ భద్రం మాట్లాడుతూ రాజమహేంద్రవరం వాసినైన తనకు మంచి గుర్తింపు పాత్రలను ఇచ్చి దర్శకుడు మారుతి ప్రోత్సహించారన్నారు. థియేటర్లకు వెళితే నవ్వించడం కష్టమైపోతున్న రోజుల్లో దర్శకుడు మారుతి మంచి పాయింట్, కాన్సెప్ట్‌తో నవ్వులతో పాటు ఎమోషన్స్‌ను పండించారన్నారు. నటులు అజయ్, సత్యం రాజేష్, సుహాస్, శ్రీకాంత్ మాట్లాడారు. అల్లు అరవింద్ నిర్మాత కావడం అదృష్టం: జక్కంపూడి రాజా చిత్రసీమలో అల్లు అరవింద్ నిర్మాతగా ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రతిరోజూ పండగే విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అల్లు అరవింద్ సక్సెస్ఫుల్ నిర్మాత అని కొనియాడారు. హీరో సాయిధరమ్‌తేజ్ అంతే తనకు ఎంతో అభిమానమని, వీవీ వినాయక్ దర్శకత్వంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలోనే జరిగిందని, ఇప్పుడు ప్రతిరోజూ పండగే విజయోత్సవం ఇక్కడ జరుగుతుందన్నారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకునేవారని, వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వంగవీటి మోహన్రంగాలైతే మూడో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. చిరంజీవి సినిమా రిలీజైతే చాలు మంత్రిగా ఉన్న సమయంలో బెనిఫిట్ షో చూసేవారన్నారు. కడియంలో వేదికపై దివంగత పద్మశ్రీ అల్లురామలింగయ్యను సత్కరించామని, త్వరలోనే రాజమహేంద్రవరంలో అల్లు అరవింద్‌ను సత్కరించే అవకాశం ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు. రాజమహేంద్రవరానికి చెందిన నటుడు భద్రంను చిత్రసీమ అంతా భద్రంగా చూసుకోవాలని కోరారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సత్య డాన్స్ ట్రూప్ సాయిధరమ్‌తేజ్ చిత్రాల్లోని పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. -
వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ.23.25 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉండటంతో ప్రేక్షాదరణ క్రమంగా పెరుగుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయితేజ్ ఆకట్టుకున్నారు. సాయితేజ్‌కు జంటగా రాశిఖన్నా నటించింది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ -
‘ప్రతిరోజూ పండుగే’ సక్సెస్ మీట్
-
నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది
‘‘యంగ్∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా. సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్ ఎదురవగానే నా కెరీర్ అయిపోయిందని చాలామంది జోక్స్ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్ దక్కింది. నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్. ‘‘థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా
‘‘సీరియస్ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను నేను. అది నా మనస్తత్వం. ఏదైనా విషయం చెప్పాలన్నా ఎంటర్టైనింగ్గానే చెబుతాను. నా సినిమాలో కథలను కూడా అలానే చెప్పాలనుకుంటాను’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ► ‘ప్రతిరోజూ పండగే’ కథను ఎవరికి చెప్పినా బావుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా రిలీజ్ ముందు కూడా పెద్ద టెన్షన్ పడలేదు. ఎందుకంటే.. ఎమోషన్స్‌తో ఓ కథను సరిగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాతో అది మళ్లీ నిరూపితం అయింది. ► థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్ కంటే కామెడీ టైమింగ్ ఏమైనా డామినేట్ అయిందా? అనే డౌట్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయి’ సినిమా తర్వాత ఇన్ని ఫోన్ కాల్స్ రావడం ఇదే. ‘చాలా హెల్దీగా చేశావు’ అని చిరంజీవిగారు అభినందించారు. ‘చాలా బాగా డీల్ చేశావు’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ► రావు రమేశ్‌గారు పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఆయన యాక్ట్ చేస్తుంటే మేమందరం ఎగ్జయిట్ అయ్యాం. ► మారుతి ఒక జానర్ సినిమాలే తీయగలడు అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమా సినిమాకు జానర్ మారుస్తుంటాను. ఒకేలాంటి సినిమాలు తీస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. ► ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. బెస్ట్ కథలే ఇవ్వాలి. వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అవే ఫ్యూచర్. నేనూ వెబ్ సిరీస్ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’కి అడిగారు. కానీ కుదర్లేదు. -
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్‌లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్‌తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్‌క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్‌ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్‌తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్‌గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
ఇది చాలదని చరణ్ అన్నారు
‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అన్నారు సాయితేజ్. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఎస్కేఎన్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన సంగతులు. ► ఇది తాత–మనవడి కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంచాలనుకుంటాడు మనవడు. తాత కోసం ఆ మనవడు ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌గారు, మనవడి పాత్రలో నేను నటించాను. నా తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు నటించారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న డైనింగ్ టేబుల్ సన్నివేశం తీసేటప్పుడు నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కనెక్ట్ అయ్యాను. ► దాదాపు పదేళ్ల క్రితం మారుతి అన్నను ఓ సంద ర్భంలో కలిశాను. అప్పుడు ఓ కథ చెప్పారు. నిజానికి నాకు అప్పటికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ, కథ విన్నా. మారుతి అన్న డైరెక్షన్లో సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది. అయితే అప్పుడు ఆయన చెప్పిన కథ ఇది కాదు. మా సినిమా విడుదలవుతున్న రోజునే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మా సినిమాతో పాటు అవికూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ► ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగాను. ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాను. ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్న ఓ సన్నివేశంలో ఫైట్ సీన్ కోసం షర్ట్ విప్పాల్సి ఉంటుంది. ్ఞఅలా ఆ సీన్లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాను. ► ఓసారి నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చరణ్ (రామ్‌చరణ్) చూశారు. ‘ఇది చాలదు’ అని ‘ధృవ’ సమయంలో తనకు జిమ్ ట్రైనర్‌గా ఉన్న రాకేష్ ఉదయార్ను సూచించారు. సరైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాను. మరోసారి బరువు పెరిగి తగ్గాలనుకోవడం లేదు. అంత ఓపిక లేదు (నవ్వుతూ). ► చిరంజీవిగారు ‘ప్రతిరోజూ పండగే’ కథ విన్నారు. బాగా చేయాలన్నారు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అది నాకు ప్లస్సో, మైనస్సో అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా భావిస్తున్నాను. -
ప్రతిరోజూ పండగే హిట్ అవుతుంది
‘‘సందేశాన్ని కూడా ఆహ్లాదకరంగా చెప్పే ప్రతిభ ఉన్న వ్యక్తి మారుతి. ఆడియ¯Œ ్స పల్స్ తెలిసిన డైరెక్టర్ తను. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. సాయితేజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. యు.వి. క్రియేషన్స్ వంశీ, నేను కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. బన్నీ వాసు కష్టపడి నిర్మించాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్ర కథను మారుతి మొదటిసారి నాకే చెప్పాడు.. బాగా నచ్చింది. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ‘శతమానం భవతి’ సినిమా అంత పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యా¯Œ ్స ఉంటే మాకు ప్రతిరోజూ పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యా¯Œ ్స. చిరంజీవిగారితో పాటు అభిమానుల ఆశీర్వాదాలు మా యూనిట్‌కి ఉండాలని కోరుకుంటున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్‌కి థ్యాంక్స్. తమన్ మంచి పాటలిచ్చాడు. ‘బన్ని’వాసు, ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను సహకారం మరువలేనిది. చిరంజీవిగారికి కథ చెప్పినప్పుడు నచ్చింది.. ఈ చిత్రం ట్రైలర్ చూసిన ఆయన మెచ్చుకున్నారు’’ అన్నారు మారుతి. ‘‘గీతా ఆర్ట్స్‌లో చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది’’ అన్నారు రాశీఖన్నా. ‘‘నా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఒక బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నటుడు నరేష్. ‘‘సాయి తేజ్ చాలా హార్డ్ వర్కర్. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి’’ అన్నారు నటుడు సత్యరాజ్. ఈ వేడుకలో ‘బన్ని’ వాసు, సహ నిర్మాత ఎస్.కె.ఎన్, నటుడు రావు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అరవింద్ డాన్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేదిక మీదకు తీసుకెళ్లి డాన్స్ చేయాలని కోరారు. సీనియర్ నటుడు సత్యరాజ్‌తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మారుతి దర్శకత్వం తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కుమార్, నరేశ్, రావురమేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. Team #PratiRojuPandaage justifying the tagline"పది మంది ఉండగా,ప్రతిరోజూ పండగే the expectations &buzz of the movie reached sky high with this electrifying moments frm pre-release🕺💃 All set for the celebrations on Dec 20th in the theatres near you 🤩#PratirojuPandaageOnDec20th pic.twitter.com/bHIMRQlgDF — Eluru Sreenu (@elurucnu) December 16, 2019 -
అందరూ కనెక్ట్ అవుతారు
సాయి తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఎస్కేయన్ సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... ► ఈ చిత్రంలో రాజమండ్రికి చెందిన టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజిల్ అర్ణా పాత్ర చేశాను. మొదట్లో నాకు టిక్ టాక్ అంటే తెలియదు. ఈ కథ వింటున్నప్పుడు భయం వేసింది. ఏంజిల్ అర్ణా ఏంటి? టిక్ టాక్ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. ఆ తర్వాత నేను టిక్ టాక్ యాప్‌ను నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ తర్వాత టిక్ టాక్ ఫన్ తెలిసింది. టిక్ టాక్‌పై సెటైరికల్‌గా నా పాత్ర ఉండదు. నా క్యారెక్టర్‌కు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ► రియల్‌లైఫ్‌లో నాకు చాలా సిగ్గు. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు. కొంతమంది నా ఫ్రెండ్స్‌లో టిక్ టాక్ చేసేవారు ఉన్నారు. క్యారెక్టర్ కోసం కొంతమంది టిక్ టాక్ సెలబ్రీటీలను కూడ కలిశాను. ‘జిల్’ సినిమా తర్వాత నేను బబ్లీ క్యారెకర్ట్ చేసింది ఈ సినిమాలోనే. ► సాయితేజ్ మంచి కో స్టార్. పాత్రకు నేను న్యాయం చేయగలనని దర్శకులు మారుతిగారు నన్ను నమ్మారు. సెట్లో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. చాలా హ్యూమరస్‌గా ఉంటారు. ► ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ► నేను హీరోయిన్గా నటించిన ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వారం గ్యాప్‌లో విడుదల అవుతున్నాయి. వీటిని నేను ప్లాన్ చేయలేదు. విడుదలైన ‘వెంకీమామ’ చిత్రంలో నేను పోషించిన హారిక పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. హారిక లాంటి పాత్ర నేను ఇంతవరకు చేయలేదు. ► ఈ చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. కథా చర్చలు జరుగుతున్నాయి. నా తర్వాతి చిత్రాల గురించి త్వరలో వెల్లడిస్తాను. -
సిక్స్ ప్యాక్ తేజ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. రీసెంట్గా రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల బెండు తీశారు. ఇంకా ఆరు పలకల దేహంతో కనిపించిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సాయితేజ్ పేరు కూడా చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని రెండు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి తేజ్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తారు. ఆ రెండు ఫైట్స్‌లో హోమం నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ ఒకటి. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. -
‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్లో గొడవ
సాక్షి, గుంటూరు ఈస్ట్: ‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ యాత్రలో భాగంగా గుంటూరు భాస్కర్ థియేటర్‌కు హీరో సాయిధరమ్ తేజ్, కథానాయకి రాశీఖన్నా వచ్చారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు.