టైటిల్: ప్రతిరోజూ పండుగే
జానర్: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: జయకుమార్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా?
కథ:
రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్‌లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్‌తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్‌క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్‌లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి.
ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్‌దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్‌లో తొలిసారి తెరమీద సాయి సిక్స్‌ప్యాక్ బాడీని ఎక్స్‌పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్‌తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్‌గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి
బలాలు
తాత-మనవళ్ల సెంటిమెంట్
కామెడీ సీన్లు
క్లైమాక్స్ సీన్లు
బలహీనతలు
రొటీన్ కథ, కథనాలు
సాగదీసినట్టు అనిపించడం
- శ్రీకాంత్ కాంటేకర్
Comments
Please login to add a commentAdd a comment