టైటిల్: బ్రో
నటీనటులు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, . కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ , బ్రహ్మానందం తదితరులు
నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం: సముద్రఖని
సంగీతం: తమన్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: జులై 28, 2023
‘బ్రో’కథేంటంటే..
మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్ వారియర్, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదే తనలోకం. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే చూసుకుంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం డబ్బు సంపాదన మీదే పెడతాడు. చివరకు తన ప్రియురాలు రమ్య(కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేడు. అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న మార్క్ ఓ రోజు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ అంధకారంలోకి వెళ్తుంది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్ టైటాన్(పవన్ కల్యాణ్) ప్రత్యక్షమవుతాడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని, కొన్ని రోజులు బతికే చాన్స్ ఇవ్వమని టైటాన్‌ని వేడుకుంటాడు మార్కండేయ. టైటాన్ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. మరి ఈ 90 రోజుల్లో మార్కండేయ తన బాధ్యతలు నెరవేర్చాడా? ఈ క్రమంలో అతను ఏం నేర్చుకున్నాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. జీవితంలో ఓ వ్యక్తికి రెండో చాన్స్ వస్తే ఎలా ఉంటుంది? దానిని సద్వినియోగం చేసుకుంటాడా? ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతాయా? లేదా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే మాతృకకు, తెలుగు ‘బ్రో’కు చాలా వ్యత్యాసం ఉంది. పవన్ కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు.
అక్కడ రెండో చాన్స్ వయసు అయిపోయిన ఓ ముసలాయనకు వస్తే.. ఇక్కడ రెండో చాన్స్ ఓ యువకుడికి వస్తుంది. అలాగే అక్కడ టైంగాడ్ పాత్ర నిడివి చాలా తక్కువ, కానీ తెలుగులో టైంగాడ్ దాదాపు సినిమా మొత్తం ఉంటాడు. అయితే ఈ మార్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. లుక్స్ పరంగా మాత్రం వింటేజ్ పవన్ కల్యాణ్‌ని తెరపై చూస్తారు.
సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథ ప్రారంభమవుతుంది. సాయితేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ భూమి మీదకు వచ్చకా..అక్కడ జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ సోసోగా ఉంటాయి. ప్రతిసారి పవన్‌ని ఎలివేట్ చేస్తూ చూపించడం ప్యాన్స్‌ని అలరిస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి అతిగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పాత పాటలను పెట్టడం కూడా మైనస్సే. ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటే చూసే ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఫ్యాన్స్ కోసమే చేశారు. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే సాయితేజ్ పాత్ర పడే సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ, కథనం బాగున్నప్పటికీ.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో హీరో సాయి తేజ్ అయినప్పటికీ సినిమా మొత్తం పవన్ కల్యాణ్ పాత్ర ఉంటుంది. టైంగాడ్ టైటాన్‌గా పవన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై వింటేజ్ పవన్‌ను చూస్తారు. ఇక మార్క్ పాత్రకు తేజ్ న్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తేజ్ బాడీలో మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా అయ్యాడు.అది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ కూడా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు.
మార్క్ లవర్ రమ్యగా కేతికా శర్మ ఉన్నంతలో పర్వాలేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ చక్కగా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్‌గా వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం జస్ట్ ఓకే. కొన్ని పాటలు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌లో తివిక్రమ్ మార్క్ అంతగా కనిపించదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment