టైటిల్ :పక్కా కమర్షియల్
నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు
నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత: బన్నీ వాసు
రచన,దర్శకత్వం: మారుతి
సంగీతం : జేక్స్ బిజాయ్
సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా
ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్
విడుదల తేది: జులై 1, 2022
వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే...
సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్‌లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు.
ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్‌కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉదంటే..
మారుతి సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు.
సీరియల్‌లో తన క్యారెక్టర్‌ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్‌కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్‌పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది.
ఎవరెలా చేశారంటే..
డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.
ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్‌తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment