స్వాతంత్య్రానికి ముందే పుట్టి.. నేటికీ మేటి!!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ 78 ఏళ్లలో దేశ వ్యాపార రంగం ఎంతో పురోగమించింది. భారతీయ వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగానూ శాసిస్తున్నాయి. అయితే స్వాతంత్య్రానికి పూర్వమే భారతీయుల వ్యాపార పటిమ ఏంటన్నది ఎందరో దిగ్గజాలు ప్రపంచానికి చాటి చెప్పారు. అలా స్వాతంత్య్రానికి ముందే పుట్టి మార్కెట్లో నేటికీ మేటిగా కొనసాగుతున్న కొన్ని భారతీయ వ్యాపార సంస్థల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..వాడియా గ్రూప్దేశంలో పురాతన వ్యాపార సామ్రాజ్యాల్లో వాడియా గ్రూప్ కూడా ఒకటి. 1736లో లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా దీన్ని స్థాపించారు. దీని అనుబంధ సంస్థ ది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1863లో స్థాపితమైంది. గో ఫస్ట్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరికొన్ని అనుబంధ సంస్థలు.టాటా గ్రూప్టాటా గ్రూప్ అనేది 150కి పైగా దేశాలలో ఉత్పత్తులు, సేవలు అందిస్తూ 100 దేశాలలో కార్యకలాపాలున సాగిస్తున్న భారతదేశపు అతిపెద్ద సమ్మేళనం. దీన్ని 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా మరెన్నో అనుబంధ సంస్థలు దీనికి ఉన్నాయి.డాబర్ ఇండియాడాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థను ఎస్కే బర్మన్ 1884లో స్థాపించారు. ఆయుర్వేద ఉత్పత్తులు, వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులను తయారు చేసే ఈ సంస్థ మార్కెట్లో అగ్ర సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.కిర్లోస్కర్ గ్రూప్1888లో స్థాపించిన కిర్లోస్కర్ గ్రూప్ దేశంలో పురాతనమైన ఇంజినీరింగ్ సమ్మేళనాల్లో ఒకటి. లక్ష్మణరావు కిర్లోస్కర్ దీని వ్యవస్థాపకులు. ఈ సంస్థ తయారు చేసే యంత్ర పనిముట్లు ఆఫ్రికా, ఆగ్నేయాసియా, యూరప్‌లోని దాదాపు 70 దేశాలకు ఎగుమతవుతున్నాయి.గోద్రెజ్ గ్రూప్ గోద్రెజ్ గ్రూప్‌ను అర్దేషిర్ గోద్రేజ్ 1897లో స్థాపించారు. మొదట తాళాల తయారీలో గుర్తింపు పొందిన ఈ సంస్థ తర్వాత అనేక ఉత్పత్తులకు విస్తరించింది. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆధిపత్యాన్ని చాటుతోంది.లక్ష్మీ మిల్స్దేశంలోని టెక్స్టైల్ రంగంలో లక్ష్మీ మిల్స్ పురాతన కంపెనీ. కోయంబత్తూరు కేంద్రంగా 1910లో జి.కుప్పుస్వామి నాయుడు దీన్ని స్థాపించారు. దేశ విదేశాల్లో నూలు దారాలు, వస్త్రాల ఉత్పత్తిలో ఇప్పటికీ రాణిస్తోంది.జేకే గ్రూప్ జేకే ఆర్గనైజేషన్ భారతీయ పారిశ్రామిక సమ్మేళనం. 1918లో లాలా కమ్లాపత్ సింఘానియా స్థాపించారు. ఈ గ్రూప్‌నకు చెందిన జేకే లక్ష్మి సిమెంట్ నిర్మాణ రంగంలో ప్రధానంగా ఉంది. అలాగే జేకే టైర్స్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది.బజాజ్ గ్రూప్బజాజ్ గ్రూప్ అనేది 1926లో జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన భారతీయ బహుళజాతి సమ్మేళనం. ఈ సమూహంలో 40 కంపెనీలు ఉన్నాయి. దీని ప్రధాన సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, త్రి-వీలర్ తయారీదారుగా పేరు పొందింది.