రికార్డులను బ్రేక్ చేస్తున్న చేతన్ లేటెస్ట్ బుక్
ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, టూ స్టేట్స్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్, ఫైవ్ పాయింట్ సమ్‌వన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి పుస్తకాలతో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న చేతన్ భగత్, తన తాజా బుక్‌తో మరోసారి పాఠకుల ఆదరణను చూరగొంటున్నారు. 'వన్ ఇండియన్ గర్ల్' పేరుతో విడుదలైన ఈ బుక్ అమెజాన్ ప్రీ-ఆర్డర్ చరిత్రలో రికార్డులు బద్దలు కొడుతోంది. అమెజాన్, రూపా పబ్లిసింగ్ భాగస్వామ్యంతో ఎక్స్‌క్లూజివ్‌గా ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమెజాన్ లో ప్రారంభమైన ఈ బుక్ ప్రీఆర్డర్లు.. ఆవిష్కరించిన రెండు గంటల్లేనే అత్యధిక ప్రీ ఆర్డర్లు నమోదుచేస్తున్నాయి.
అమెజాన్ లాంచ్ అయినప్పటి నుంచీ ఏ ప్రొడక్ట్‌కు నమోదుకాని ఆర్డర్లను ఈ బుక్ సొంతంచేసుకుంటోందని, ప్రీ ఆర్డర్లో ఆధిపత్య స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఈ-కామర్స్ దిగ్గజం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెజాన్‌లో నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తున్న వన్ ఇండియన్ గర్ల్ పుస్తకంపై చేతన్ భగత్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన పాఠకులకు ధన్యవాదాలు తెలిపారు. శనివారమే ఈ బుక్కు సంబంధించిన టీజర్‌ను కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు. మహిళా ఆధారితంగా ఓ పుస్తకం రాయాలని గత కొంత కాలంగా భావించిన భగత్, ఫీమేల్ వాయిస్‌లో దీన్ని రచించారు.ఈ పుస్తకం సమాజాన్ని కచ్చితంగా ఆలోచింపబరుస్తుందని భగత్ ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యారీ పోటర్ కంటే 20 టైమ్స్ ఎక్కువగా పాపులర్ అయిందని తెలుస్తోంది.