గిల్లినా నవ్వుతున్నారు
ఏం చేస్తాం.. సమాజం ఇలా ఉంది! మార్చాలంటే మీ చేతుల్లో... మా చేతుల్లో ఉందా? అందరూ కలిసి కూర్చోని ఏడిస్తే మారుతుందా? నవ్వితే మాత్రం మారుతుందంటున్నారు షెఫాలీ పాండే, ప్రీతి దాస్ మారుస్తాం మారుస్తాం అని గ్యాస్ కొట్టకుండా లాఫింగ్ గ్యాస్‌తో మార్పు మొదలెట్టారు! గిల్లితే ఎవరైనా ఏడుస్తారు. కానీ సమాజంలో జరుగుతున్న తప్పులకు మనమే కారణమని వీళ్లు తొడపాశం పెట్టినా నవ్వుతున్నారు!!
వ్యంగ్యం మంచి అస్త్రం! బాధ, ఆగ్రహం, ఆవేశాలను అదే రూపంలో తెలియపరచడం కంటే వ్యంగ్యానికి తర్జుమా చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తే చేరుకునే రీచ్ ఎక్కువ. అనుకున్న ఫలితం వచ్చే చాన్సూ ఎక్కువే! ఇప్పటికీ కంప్లీట్ హ్యూమర్ కన్నా కూడా వ్యంగ్యం కలిసిన హాస్యానికే మంచి ఆదరణ. అందుకే స్టాండప్ కామెడీకి.. కమెడియన్స్‌కి క్రేజ్ పెరిగిందిప్పుడు. ఎంత సీరియస్ ఇష్యూనైనా సరే వ్యంగ్యాన్ని జోడించి కామెడీ చేస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడే గాంభీర్యులు కూడా మనసారా నవ్వుకుంటూ ఆ సెటైర్లో దాగిన సమస్యను మెదడుకు ఎక్కించుకుంటున్నారు. అలాంటి స్టాండప్ కామెడీతో కాంట్రాసెప్టివ్ పిల్స్ నుంచి కథువా రేప్, బాలీవుడ్, డేటింగ్, చైల్డ్‌బర్త్, అచ్ఛేదిన్, మేకిన్ ఇండియా, బేటీ బచావో– బేటీ పఢావో వంటి సీరియస్, పొలిటికల్ ఇష్యూస్ దాకా.. అన్నిటి మీద వ్యంగ్యాన్ని జొప్పిస్తూ జోకులు పండిస్తున్నారు, నవ్వుతో జనాలను ఆలోచింపచేస్తున్నారు, అవగాహన కలిగిస్తున్నారా ఇద్దరు మహిళా స్టాండప్ కమేడియన్స్.
ఎవరు? షెఫాలీ పాండే, ప్రీతి దాస్. ఎక్కడ? అహ్మదాబాద్‌లో...
తొమ్మిదేళ్లు న్యూయార్క్‌లో, రెండేళ్లు ముంబైలో ఉండి అహ్మదాబాద్‌కు చేరుకుంది షెఫాలి. ప్రస్తుతం ఒక డిజిటల్ ఏజెన్సీని నిర్వహిస్తోంది. ప్రీతి దాస్.. వృత్తిరీత్యా జర్నలిస్ట్. పీహెచ్డీ స్టూడెంట్ కూడా. హాస్యం అంటే ఆసక్తి ఉన్న ఈ ఇద్దరూ 2017లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పుడే ‘‘మహిళా మంచ్’’ అనే ఆలోచనను పంచుకున్నారు.
ఏమిటీ మహిళా మంచ్?
ఇదో మహిళా స్టాండప్ కామెడీ గ్రూప్. రాజకీయాలు, సామాజిక సమస్యల మీద వ్యంగ్యంతో కామెడీని పంచుతున్నారు. మొదట్లో ఒక ట్రయల్‌గా ఓ స్నేహితురాలి ఇంట్లోనే స్టాండప్ కామెడీ ప్రయోగం చేశారు. డెబ్బై మంది హాజరయ్యారు. ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయిన షెఫాలి, ప్రీతి ఇక మహిళామంచ్ను ఆపేదిలేదని నిర్ణయించుకున్నారు.
‘‘బేటీ బచావో.. బేటీ పఢావో’’ అన్న నినాదాన్ని.. దేశంలో మహిళల మీద జరుగుతున్న లైంగికదాడుల నేపథ్యంలో ఇలా ‘‘మా.. బెహన్.. దాదీ.. బేటీ బచావో.. మా .. బెహన్, దాదీ, బేటీ ఛుపావో’’ అంటూ వ్యంగ్యంగా మార్చి రాసిన పోస్టర్స్‌ను పెట్టారు ఒక షోలో.
టీ.. కాఫీ.. కామెడీ
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ‘‘మంత్లీ పీరియడ్ షో’’ పేరుతో నెలకొకసారి స్టాండప్ కామెడీ షోను నిర్వహిస్తునే ఉన్నారు. కేఫ్‌లు, రెస్టారెంట్స్, స్నేహితుల ఇళ్లే వాళ్ల వేదికలు. టీ, కాఫీతో పాటు కామెడీనీ సర్వ్ చేస్తారు. ఒక్కోసారి ఒక్కో గెస్ట్ స్పీకర్లను ఆహ్వానిస్తారు. ఆ స్పీకర్స్ వాళ్ల జీవితానుభవాలను హాస్యంతో పంచుకుంటారు.
‘‘దీనివల్ల ఈ షో చూడ్డానికి వచ్చిన వాళ్లు తాము పడ్తున్న కష్టాలను తేలిగ్గా తీసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అందువల్లే గెస్ట్ స్పీకర్స్నూ పిలుస్తున్నాం’’ అంటారు షెఫాలి అండ్ ప్రీతి.
వ్యవస్థ మీదే తప్ప వ్యక్తుల మీద కాదు
వ్యక్తుల బలహీనతలు, లోపాల మీద వీళ్లు కామెడీ చేయరు. మొదట్లో చెప్పుకున్నట్టు వ్యవస్థలోని లోపాలు, పాలసీల మీదే వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు విసురుతారు. ప్రీతిదాస్కు రాజకీయాల మీద కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆమె చేసే కామెడీ రాజకీయాల మీదే ఉంటుంది. షెఫాలీ మహిళా సమస్యల మీద బాగా స్పందిస్తుంది. అవే ఆమె హాస్యానికి అంశాలవుతాయి. రుతుక్రమం మీది అపోహల మీద ప్రీతి జోక్స్ వేస్తే వెంటనే డేటింగ్ మీద, దేశీ పోర్న్ మీద షెఫాలీ కామెడీ పుట్టిస్తుంది. అలా ఇద్దరు అప్పటికప్పుడు ఆశువుగా హాస్యాన్ని పండిస్తూ మహిళా స్టాండప్ కమెడియన్స్కున్న హద్దులు చెరిపేస్తున్నారు. కడుపుబ్బా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. ‘‘సహజంగానే బ్రెయిన్ అండ్ పవర్ తమ సొత్తు అనుకుంటారు మగవాళ్లు. మాలాంటి వాళ్లను వేదిక మీద చూసేసరికి కంగుతింటున్నారు. సమకాలీన రాజకీయాలు, టెక్నాలజీ మీద మేం జోక్స్ వేస్తుంటే చాలామంది నోళ్లు వెళ్లబెడ్తుంటారు. అన్నం, పప్పు, చారు, చట్నీ కాకుండా వీళ్లకు ఇవి కూడా తెలుసా? అన్నట్టు ఉంటాయి వారి ఎక్స్ప్రెషన్స్’’ అంటుంది షెఫాలీ.
మా .. బెహన్ షో
సాధారణంగా మన సమాజంలో మగవాళ్లను తిట్టే.. మగవాళ్లు తిట్టుకునే తిట్లు కూడా అమ్మ, అక్క ఆలీ మీదే ఉంటాయి. అలాంటి తిట్లకు చెక్ పెట్టడానికి వీళ్లు ‘మా.. బెహన్ షో’ చేశారు. విశేష ఆదరణ లభించింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్లోని పాటలకు పేరడీ పాటలు రాసి ఒక షో నిర్వహించారు. గుజరాత్‌లోని చట్టవ్యతిరేకమైన సారా వ్యాపారం మీద ‘‘అవర్ బేవ్డా గుజరాత్’’ పేరుతో కామెడీ షో చేశారు. దానికి ఆరువందల మంది హాజరయ్యారట. వీళ్ల షోలన్నీ ఉచితంగానే ఉంటాయి. కనీసం రికార్డ్ చేసుకొని యూట్యూబ్ చానెల్లో పెట్టుకోవడం, ఆ వీక్షణల ద్వారా డబ్బు సంపాదించుకోవడమూ ఉండదు. కారణం హాస్యాన్ని వాళ్లంత పవిత్రంగా చూస్తారట. షో అయిపోగానే ఓ హ్యాట్ పట్టుకొని ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్తారు తోచింది అందులో వేయమని అంతే. అలా వచ్చిన డబ్బు మైక్ ఖర్చులకు సరిపోతే చాలనుకుంటారు.
జాగ్రత్త... జనాలు గమనిస్తున్నారు..
‘‘ఎంత మా షోలను ఆదరిస్తున్నా ఛాందస, సంప్రదాయ అహ్మదాబాద్ ఏదో రకంగా మమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మా పేరెంట్స్ మా షోస్‌కి రారు. రాకపోగా... ‘జాగ్రత్త.. జనాలు గమనిస్తున్నారు’ అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంటారు. మావారు, మా అబ్బాయి మాత్రం ప్రతీ షో అటెండ్ అవుతారు. అరేంజ్మెంట్స్లోనూ హెల్ప్ కూడా చేస్తారు. మా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మా షోస్ చూసి ‘‘ మీ మీద ఫెమినిస్ట్లనే ముద్రేస్తారేమో జనాలు అంటూ భయపడ్తుంటారు’’ అని చెప్తుంది ప్రీతీ దాస్. ‘‘మా జీవితానుభవాలతోనే కామెడీ చేస్తాం కాబట్టి మా కామెడీలో నిజాలే ఉంటాయి’’ అంటుంది షెఫాలీ పాండే. ‘‘మంత్లీ పీరియడ్ షోస్‌ను ఇంకా విస్తరించాలనుకుంటున్నాం. మరింత మంది మహిళలు వచ్చేలా... మరిన్ని సిటీస్‌కి చేరేలా’’ అంటూ తమ లక్ష్యాన్ని చెప్పారు ఇద్దరూ.