కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయి? ఎలా సిద్ధం కావాలి?
- శ్రావణి, గాంధీనగర్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో మొదటి పేపర్లో దాదాపు 26 నుంచి 30 ప్రశ్నల వరకు జనరల్ సైన్స్, పర్యావరణం విభాగాల నుంచి వస్తున్నాయి. జనరల్ సైన్స్ విభాగంలోని జీవ శాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రంలోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విసృ్తతంగా చదవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్‌లో జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఉంటాయి. వీటితోపాటు టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంతో అడుగుతారని గుర్తించాలి. జీవావరణ శాస్త్రంలో స్థూలంగా ఆవరణ శాస్త్ర భావనలు, పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం తదితర అంశాలు ఉంటాయి. జీవ శాస్త్రంలో అభ్యర్థులు వృక్ష, జంతు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దష్టి సారించాలి. అదేవిధంగా మానవ శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఇటీవల ప్రబలుతున్న ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అధికమవుతున్న కాలేయ, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్లు, వాటి చికిత్స, వాడాల్సిన ఔషధాలు, టీకాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు - వారి పరిశోధనలు వంటివి చాలా ముఖ్యమైనవి. భౌతిక శాస్త్రంలో వివిధ సూత్రాల ఆధారంగా పనిచేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనింగ్, విద్యుత్ ఉత్పాదన ప్రమాణాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదువుకోవాలి. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు (కాస్మొటిక్స్, టాయ్‌లెట్రీస్, ఫార్మాస్యూటికల్స్), అదేవిధంగా ప్లాస్టిక్స్, పాలిమర్స్‌కు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలి. జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యం, జీవజాతులు వంటి అంశాలపై కూడా క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి జీవ వైవిధ్యానికి కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య హాట్‌స్పాట్స్, వివిధ దేశాల మధ్య పర్యావరణ ఒప్పందాలు మొదలైనవాటిని బాగా చదవాలి.
చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ బుక్స్ - సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్; రిఫరెన్స్ కోసం: సైన్స్ రిపోర్టర్;
ఎన్విరాన్మెంటల్ సర్వే; హిందూ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్; దినపత్రికల సైన్స్ కాలమ్స్
ఇన్పుట్స్: సి.హరికృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్
నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఏయే అంశాలపై దృష్టి సారించి ప్రిపేరవ్వాలో తెలియజేయండి?
- ఎం.సందీప్, రాంనగర్
బ్యాంకు పరీక్షలు రాసే చాలామంది అభ్యర్థులకు బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్ కొత్తదే. ఈ విభాగాన్ని ఏవిధంగా ప్రిపేరవ్వాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏయే అంశాలను చదవాలి? అనే విషయాలకు సంబంధించి చాలామందికి స్పష్టత ఉండదు.
రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అంటే ఒక బ్యాంకులో ఒక రోజు జరిగే పనులపై అవగాహన ఉండాలన్నమాట. ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి గరిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పే రీతిలో ఈ విభాగం నుంచి ప్రశ్నల కూర్పు ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు డిపాజిట్ చేయడానికి ఉపయోగించే స్లిప్‌ను ఏమంటారు? అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మేగజైన్లను క్రమం తప్పకుండా చదవడం ద్వారా కావాల్సిన వివరాలను సేకరించవచ్చు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సూక్ష్మ రుణ సంస్థలు లాంటి అనుబంధ అంశాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధించడం, ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ లాంటి వెబ్సైట్లలో ఆన్లైన్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చు.
ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్