సరిపడా ఎరువులు తెప్పించండి
– కంపెనీల ప్రతినిధులకు జేడీఏ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయశాఖ కమిషనర్ ఇచ్చిన సప్లయి ప్లాన్ మేరకు జిల్లాకు అవసరమైన మేరకు ఎరువులు తెప్పించాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన చాంబర్లో ఎరువుల కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండటం, రబీ సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో అందుకు సరిపడా ఎరువులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మార్క్పెడ్, కంపెనీ గోదాములు, ప్రయివేటు డీలర్ల దగ్గర ఉన్న ఎరువుల నిల్వలపై సమీక్షించారు. ఈ నెలలో కంపెనీ వారీగా ఎన్ని ర్యాక్లు రావాలి, ఎన్ని వచ్చాయనే విషయంపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో అవసరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు పుష్కలంగా ఉన్నాయని, పెద్దగా డిమాండ్ లేదని తెలిపారు. సమావేశంలో డీడీఏ(పీపీ) మల్లికార్జునరావు, కర్నూలు ఏడీ రమణారెడ్డి, పర్టిలైజర్ ఏఓ వేదమణి తదితరులు పాల్గొన్నారు.