రోగాలను నిరోధించే పచ్చికొబ్బరి
అన్నానగర్: పచ్చి కొబ్బరిలో కేవలం 50 శాతానికి మించి కొవ్వు ఆమ్లాలు లేవని, వీటిని మన దేహం పూర్తిగా శక్తిగా మారుస్తుందే కానీ మిగిలిన నూనెలకు మల్లే శరీరంలోని కొవ్వును వృద్ధి చేయదని న్యూట్రీషనిస్టులు చెప్పారు. కొబ్బరిలోని మోనోలారిన్ అనే పదార్థం మెదడును ఆరోగ్యంగా ఉంచి పక్షవాతం రాకుండా నివారిస్తుందని తెలిపారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి జీవులను శరీరంలో ఎదగనివ్వదన్నారు. కొబ్బరి తినేవారికి ఇన్ఫెక్షన్లు సోకవని పేర్కొన్నారు. కొబ్బరిలో సిలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి లోహాలున్నాయన్నారు. అదేవిధంగా అకాల వృద్ధాప్యాన్ని నివారించే విటమిన్ ఈ, శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్ సితో పాటుగా బి-వన్, బి-త్రీ, బి-ఫైవ్, బి-సిక్స్‌లు సమృద్ధిగా ఒక్క కొబ్బరిలోనే లభ్యం అన్నారు.
వాస్తవానికి కొబ్బరి వాడకపోవడం వల్లనే పిల్లల్లో పోషకాహార లోపాలు కన్పిస్తున్నాయని న్యూట్రీషనిస్టులు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటల లోపల కొబ్బరితో చేసిన పదార్థాలు తింటే ఎంతో మంచిదన్నారు. ఉదయం వేళ నూనెతో చేసిన వస్తువులను తినరాదని అయితే నూనె శాతం తక్కువ కలిగిన కొబ్బరి పదార్థాలు అంటే కొబ్బరి చట్నీ వంటి వాటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఎండుకొబ్బరి కంటే అప్పటికప్పుడు కొట్టిన పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కొబ్బరిలో పాలీశాచ్యురేటడ్ తైలాలు ఎక్కువ అన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొబ్బరి జాతి వాస్తవానికి ఆస్ట్రేలియా దేశానిదని అయితే ఇవి భారతీయుల జన జీవనంలో ఒక ప్రధాన భాగమైపోయాయన్నారు. ఎండు కొబ్బరిని కొంచెం తక్కువగా వాడటం మంచిదని వీరు చెబుతున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలు కొబ్బరి మంచిది కాదని చెప్పడం విచారకరమన్నారు.