ద్వంద్వ ప్రమాణాలు
కొన్ని పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. మనం వింటున్నదీ, చూస్తున్నదీ నిజమేనా అనిపిస్తాయి. వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు విధిస్తున్న భారత శిక్షాస్మృతిలోని నిబంధనలు సబబైనవేనని వాదిస్తూ సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ అలాంటి స్థితినే కల్పించింది. ఆంక్షలకు సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వాల మాట ఎప్పుడూ ఒక్కటే. అవి ఉండి తీరాలని వాదిస్తాయి. అందులో వింతేమీ లేదు. కానీ అలాంటి ఆంక్షలు లేకపోతే సమాజంలో వైషమ్యాలను ప్రేరేపించేవారు పెరుగుతారని, అందువల్ల సమాజ మనుగడకు ముప్పువాటిల్లుతుందని ఆ అఫిడవిట్లో కేంద్రం పేర్కొనడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకపక్క గత కొన్ని నెలలుగా ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, బీజేపీ నేతలు యథేచ్ఛగా తమకు తోచింది మాట్లాడుతున్నారు. ఎదుటివారి మతాన్ని, వారి విశ్వాసాలనూ, వారి దేశభక్తినీ శంకించడంతో ఆగక వారు తినే తిండి విషయంలో సైతం వ్యాఖ్యానాలు చేయడం అందరూ చూస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని సహనంతో మెలగాలని సూచించినప్పుడూ...బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొందరు నేతలను పిలిపించి మాట్లాడినప్పుడూ అలాంటివారి నోళ్లకు తాళాలు పడతాయని అందరూ భావించారు. కానీ అవేమీ పనిచేయలేదు. తన పుట్టినరోజుపూటా చెప్పాలనిపించి కావొచ్చు... బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రెండు మంచి ముక్కలు చెప్పాడు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న అసహనం మంచిదికాదన్నాడు. సృజనాత్మక అంశాలపైనా, మతంపైనా అసహనమనేది దేశానికి హానికరమని అభిప్రాయపడ్డాడు. అంతే...బీజేపీ నేతలు చెలరేగిపోయారు. ఒకరు ఆయనను పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో పోలిస్తే ఇంకొకరు అక్కడికే పొమ్మని సలహా ఇచ్చారు. గొడ్డు మాంసం తినాలనిపిస్తున్నదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నందుకు ఆ రాష్ట్ర బీజేపీ నేత ఏకంగా ఆయన తల నరికేస్తానని హెచ్చరించారు. స్వపక్షంలో ఇలా మాట్లాడేవారిని అదుపూ చేయక...అలాగని కేసులూ పెట్టక నెట్టుకొస్తున్న కేంద్రం వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు విధించకపోతే సమాజం అల్లకల్లోలమవుతుందని చెప్పడం విడ్డూరమే.
రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులకు ఉండే పరిమితులన్నీ ఆచరణలో సాధారణ పౌరులకు వర్తిస్తున్నాయి తప్ప అధికారంలో ఉన్నవారికీ...అధికారానికి దగ్గరగా ఉన్నవారికీ అలాంటివి అడ్డురావడం లేదని ఇన్ని దశాబ్దాల అనుభవం రుజువు చేస్తున్నది. పరిమితులు విధించే చట్టాలన్నీ తమకు నచ్చని భావాలున్నవారిని ఖైదు చేయడానికి మాత్రమే పాలకులు వినియోగిస్తున్నారు. గతంలో విప్లవ రచయితలకు మాత్రమే వర్తింపజేసిన ఈ తరహా చట్టాలు ఇంటర్నెట్ మాధ్యమం విస్తరించాక అందరిపైనా ఎడాపెడా ప్రయోగించడం చూస్తున్నాం. శివసేన అధినేత బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు ఫేస్బుక్లో ఒక వ్యాఖ్య పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువతులను...బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వచ్చిన కార్టూన్ పంపారని కోల్‌కతాలో ఒక ప్రొఫెసర్‌ను...అవినీతిపై కార్టూన్లు వేసినందుకు ముంబైకు చెందిన అసీమ్ త్రివేదీని గతంలో వేర్వేరు సందర్భాల్లో అరెస్టు చేశారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న తీరును విమర్శిస్తూ పాటలు రాసి పాడిన కోవలన్ అనే కళాకారుణ్ణి అక్కడి పోలీసులు నిర్బంధించారు.
పౌరుల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్న రకరకాల సెక్షన్లన్నీ 155 ఏళ్లనాటివని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. 1860లో బ్రిటిష్ వలస పాలకులు తమ పాలనకు ఎలాంటి అవరోధాలూ ఎదురుకాకుండా చూసుకోవడానికి వీటిని పొందుపరిచారు. తమ రాతలద్వారా, ప్రసంగాలద్వారా సమాజంలో భిన్నవర్గాలమధ్యా, బృందాలమధ్యా వైషమ్యాలను ప్రేరేపించడం... ఉద్రిక్తతలను సృష్టించడం...శాంతిభద్రతలకు భంగం కలిగించడం...రాజద్రోహం వంటివి ఈ సెక్షన్లు ఏకరువు పెడతాయి. స్వాతంత్య్రం లభించి 68 ఏళ్లవుతున్నా ఈ బాపతు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని మన పాలకులకు ఏనాడూ తోచలేదు. వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు ఈ సంవత్సరం మూడు కీలకమైన కేసులు పరిశీలనకొచ్చాయి. అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66-ఏ నిబంధనకు సంబంధించిన కేసు ఒకటి.
ఆ నిబంధన రాజ్యాంగం హామీ ఇస్తున్న వాక్ స్వాతంత్య్రానికీ, భావ ప్రకటనా స్వేచ్ఛకూ భంగకరంగా ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పును అన్ని వర్గాలవారూ ప్రశంసించారు. రెండో కేసు మహారాష్ట్రకు సంబంధించింది. ‘చారిత్రకంగా గౌరవప్రపత్తులున్న వ్యక్తులను’ కించపరచడం నేరమే అవుతుందని, అలాంటి సందర్భాల్లో భావ ప్రకటనాస్వేచ్ఛకు పరిమితులు విధించడం సబబేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం విద్వేషపూరిత ప్రసంగాల పేరిట వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు విధిస్తున్న ఐపీసీలోని వివిధ సెక్షన్ల రాజ్యాంగబద్ధతపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన కేసు సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. ఆ కేసుపైనే కేంద్రం తాజా అఫిడవిట్ దాఖలు చేసింది.
హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో ఆయనపై నడుస్తున్న కేసు సబబేనని ఆ అఫిడవిట్లో ప్రభుత్వం సమర్ధించుకుంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల మాటున విద్వేషాలు రెచ్చగొట్టడం సమర్థనీయం కాదని కూడా చెప్పింది. ఈ కేసు మాటెలా ఉన్నా...ప్రస్తుతం బీజేపీ నేతల ప్రసంగాల తీరెలా ఉన్నా వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనాస్వేచ్ఛలకు ఆటంకం కలిగిస్తున్న సెక్షన్లు తొలగించాలనే ప్రజాస్వామికవాదులు వాంఛిస్తారు. ఎందుకంటే ఆ సెక్షన్లు సహేతుకమైన అసమ్మతిని, అసంతృప్తిని, నిరసనను అణగదొక్కుతున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారి విషయంలో ఎలా మెలగాలో ప్రజల వివేచనకు వదిలేయడమే ఉత్తమం.