విద్యార్థులతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన.... అరెస్ట్
మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రులతో సమాన స్థానం గురువుకు ఇచ్చిన సమాజం ఇది. బిడ్డల్లా చూడాల్సిన విద్యార్థినులను అక్కడక్కడా కొందరు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా కొన్ని ఉదంతాలు మాత్రమే వెలుగు చూస్తూన్నాయని పలువురి భావన. తాడేపల్లిగూడెంలో ఓ ప్రైవేట్ స్కూల్ యజ మాని, ప్రిన్సిపాల్ అయిన వ్యక్తి తన పాఠశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. తల్లిదండ్రులకు చె ప్పుకోవటానికి కూడా సిగ్గుపడిన ఆ బాలికలు మానసిక క్షోభ అనుభవిం చారు. చివరకు వారికే తట్టిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఒక్క ఫోన్ కాల్ చేశారు. మూడు రోజుల ర హస్య విచారణ అనంతరం బాలికలు చెప్పింది నిజమేనని నిర్ధారణకు వచ్చి ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.
వివరాలు ఇవి.. స్థానిక భాగ్యలక్ష్మీపేటలో సన్‌షైన్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ యజమాని, ప్రిన్సిపాల్ అయిన గొర్రెల శ్రీనివాసరావు పుట్టు మచ్చలు చూడాలంటూ విద్యార్థినులను బాత్రూంలోకి తీసుకెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మంది బాలికలు ఇలా క్షోభ అనుభవించారు. ఈ విషయాన్ని అమ్మనాన్నలకు చెప్పుకోలేకపోయారు. దీని పరిష్కారం కోసం కాస్త బుర్రపెట్టి ఆలోచించారు. చైల్డ్‌లైన్ గురించి వారికి తెలిసి ఉండటంతో 1098 నంబరుకు ఈ నెల 13న ఆ బాలికలు ఫోన్ చేశారు.
ఫోన్లో బాలికల గోడు విన్న సంస్థ ప్రతినిధులు తాడేపల్లిగూడెం వచ్చి మూడు రోజులపాటు రహస్యంగా విచారణ చేశారు. బాలికలు చెప్పింది నిజమని నిర్ధారణకు వచ్చారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలనే వంకతో చైల్డ్‌లైన్ ప్రతినిధు లు శనివారం ఆ స్కూల్లోకి ప్రవేశించారు. విద్యార్థినీ, విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. వారి వాం గ్మూలం నమోదు చేశారు. మొత్తం విషయాలను రాబట్టిన తర్వాత ఆ పాఠశాలలో జరుగుతున్న దారుణంపై ఎంఈవోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు
ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుపై లైంగికనేరాల నిరోధక చట్టంలోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి చెప్పారు. ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చైల్డ్‌లైన్ ప్రతినిధుల పరిశోధనలో నిర్ధారణ అయిందని తెలిపారు. చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్ మాట్లాడుతూ ఈ నెల 13 సాయంత్రం బాలికలనుంచి ఫోన్ వచ్చిందని, దాంతో ఇక్కడికి నాలుగుసార్లు వచ్చి విచారణ చేసి నిజనిర్ధారణ జరిగాక ఎంఈవోకు ఫిర్యాదు చే శామన్నారు. బాలలకు వివాహాలు, వారిని యాచకులుగా మార్చటం, లైంగిక వేధింపులకు గురిచేయటంవంటి చర్యలు ఎవరు గమనించినా చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నోడల్ అధికారి బి.నరేంద్ర, ఎంఈవో జల్లా శ్రీరామచంద్రమూర్తి, పట్టణ ఎస్సైలు కొండలరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.