ఆశలకూ, ఆచరణకూ లంగరు అందేనా?
త్రికాలమ్
ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్ గ్రిడ్ నిర్మించి ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త.
సుదీర్ఘమైన ఉద్యమం ఫలితంగా ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం ప్రజలకు కోటి ఆశలుంటాయి. సత్వరం పరిష్క రించవలసిన అనేక సమస్యలుంటాయి. ఉద్యమానికి సారథ్యం వహించి వందల హామీలు ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు రాష్ట్రావతరణ తర్వాత అధికార పార్టీగా, ప్రభుత్వ సారథిగా విధులు చేపట్టిన క్షణం నుం చి ప్రజల కలల సాకారానికి కృషి ఆరంభం అవుతుంది. ప్రభుత్వ హృదయాన్ని ఆవిష్కరించేది వార్షిక బడ్జెట్; అందులోని ప్రాథమ్యాలు, కేటాయింపులు, ప్రత్యేక పథ కాలు, కొత్త చొరవలు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 5వ తేదీన తెలంగాణ శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలలో కనిపించిన కొత్త చొరవలలో ముఖ్యమైనవి చెరువుల పునరుద్ధరణ, దళితులకు భూమిపంపిణీ, ప్రతిపల్లెకూ మంచినీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్, విద్యుచ్ఛక్తి కొర తను అధిగమించాలన్న ఆకాంక్ష.
అర్థవంతంగా సాగిన బడ్జెట్ చర్చ
బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో సంపూర్ణంగా నెరవేరుతుందా లేదా అన్నది శాసనసభా వేదికపైన చర్చనీయాంశం కావాలి. చర్చ మొత్తం మీద ప్రయోజనకరంగానే సాగింది. తెలుగుదేశం పార్టీ (తెదేపా) సభ్యులను సస్పెం డ్ చేయడం ఒక్కటే అపశ్రుతి. తెదేపా సభ్యులపైన సభాపతి తీసుకున్న చర్యకూ, బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఆ పార్టీ ప్రయోజనాలకీ, ఆ పార్టీ సభ్యుల సంచలనాత్మక ప్రవర్తనకూ సంబంధం ఉంది. తెదేపా నాయకుడు రేవంత్‌రెడ్డి కొండంతరెడ్డిగా ఎదిగేందుకు శాసనసభను వేదిక చేసుకోవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా పదునైన విమర్శనాస్త్రాలు సంధించడం సైతం ప్రజాస్వామ్యబద్ధమే. వాక్చాతు ర్యం కలిగిన యువనాయకుడికి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకోవడానికి తగిన సామాజిక, రాజకీయ కారణాలు ఉండవచ్చు. అది ఎర్రబె ల్లి దయాకర్ వంటి నాయకులు తేల్చు కోవలసిన అంశం. బడ్జెట్ ప్రతిపాదనల మంచిచెడ్డలకూ, తెలుగుదేశం పార్టీ సభ్యు లు ప్రస్తావించిన అంశాలకూ పెద్దగా పొంతనలేదు. ఇందుకు భిన్నంగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి చేసిన ప్రసంగంలో ప్రభుత్వానికి సూటిగా తగిలే విమర్శలూ, నిర్మాణాత్మకమైన సూచనలూ ఉన్నాయి. కాంగ్రెస్ సభ్యులతోపాటు భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు చేసిన విమర్శలకు కూడా కేసీఆర్, ఈటెల ప్రసంగాలలో సమాధానాలు కనిపిస్తాయి. చట్టసభలలో జరిగే వాగ్యుద్ధాలలో నోరూ, అధికారం ఉన్నవారు పైచేయి సాధించడం సర్వసామాన్యం.
ఫ్లోరోసిస్ ప్రాంతాలపై కరుణ
దీనికంటే ప్రధానమైనవి బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రభుత్వం వెల్లడించిన సందేశం, తలబెట్టిన పథకాలూ, కార్యక్రమాలూ, కేటాయించిన నిధులూ, స్వప్నించే భవిష్యత్ చిత్రపటం, ఏ తీరాలకు ఈ ప్రతిపాదనలు నడిపిస్తాయో శాసనసభ్యులు చర్చించి నిగ్గుతేల్చాలి. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకూ, పోరా టం చేసిన కళాకారులకూ, జర్నలిస్టులకూ, న్యాయవాదులకూ, వైద్యులకూ, ఇతర అనేక వర్గాలవారికి మేలుచేయాలన్న విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్‌గ్రిడ్ నిర్మించి ప్రతిపల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తరతరాలుగా తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకా రం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త. ఆదివాసీల, మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరితే ఆనందదాయకమే. దళిత యువ తుల కోసం ప్రకటించిన కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా విస్తరించడం ఆహ్వా నించదగినదే. వెనుకబడినవర్గాల సంక్షేమంకోసం ప్రభుత్వం సంకల్పించిన చర్య లను ఖండించేవారు ఎవ్వరూ ఉండరు. ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఆచరణ సాధ్యమా, కాదా అన్న కోణం నుంచి మాత్రమే ప్రశ్నించాలి.
విపక్ష వాదనలూ సబబే
లోటు బడ్జెట్ భవిష్యత్తుమీద నమ్మకానికి నిదర్శనం. ప్రణాళికా వ్యయం ప్రణా ళికేతర వ్యయానికి దాదాపు సమానంగా (48 శాతం) ఉండటం చిత్తశుద్ధికి సంకేతం. అంతమాత్రాన జానారెడ్డి లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం లేదని చెప్పజాలం. ఊహాగానాలూ, ఆశలపల్లకీ అంటూ ప్రతిపక్ష నేత చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టవలసినవి కావు. లోటు ఏ విధంగా పూరిస్తారు? రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం కంటే అధికంగా రుణాలు తీసుకోరాద నే నిబంధనను ఎట్లా అధిగమిస్తారు? కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.21వేల కోట్లు వస్తుందని రాజేందర్ అంచనా కూడా నమంజసంగా కనిపించదు. 2012-13లో రూ.7500 కోట్లు, 2013-14లో రూ.9000 కోట్లు ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ (కేంద్ర సాయం) 2014-15లో రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని ఆశించగలమా? అందులోనూ తెరాస ప్రభుత్వానికి, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కీ మధ్య సఖ్యత అంతంత మాత్రమేనని అనుకుంటున్న దశలో అంత ఉదారంగా సాయం అందుతుందనుకోవడం అవాస్త విక దృష్టి కాదా? ఇంతకంటే ఆసక్తికరమైనది ఎం.ఐ.ఎం. నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు మాసాలలో లక్షకోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు? లక్ష కోట్లు ఎట్లా సమీకరిస్తారనే ప్రశ్న ఇందులోనే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి రూ.80 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేసినప్పటికీ అంత ఆదాయాన్ని వచ్చే నాలుగు మాసాలలో సమీకరిం చగలరా? ప్రభుత్వ భూములు విక్రయించి రూ.6500 కోట్లు సంపాదించడం అయ్యే పనేనా? ఇది ఫక్తు నేలవిడిచి సాము చేయడం కాదా?
విద్యుత్‌పై అంచనాలు వాస్తవికమేనా?
ఖరీఫ్ తరుణంలో రాష్ట్రం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతోంది. జూలై నాటికి అదనంగా 1500 మోగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని ఏ అంచనాపై, ఏ హామీపై ముఖ్యమంత్రి చెబుతు న్నారో తెలియదు. కొత్త ప్రాజెక్టు ఏదీ నిర్మాణంలో లేదు. ఈ సంవత్సరం మేలో ఉమ్మడి రాష్ట్రం టెండర్లు ఖరారు చేసి దక్షిణాది విద్యుదుత్పత్తిదారుల నుంచి మొత్తం 1800 మెగావాట్లు కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకున్నది. అందులో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వాటాకింద 950 మెగావాట్ల విద్యుత్తు అందుతోంది. ఇది వచ్చే సంవత్సరం మే 31వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత వినియోగం కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సకాలంలో చేసుకోవ డంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెండర్లు పిలవడంలో జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వరం టెండ ర్ల ప్రక్రియ పూర్తిచేసి 2100 మెగా వాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నది. అందుకే ఏపీలో రోజుకు 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందని చంద్రబాబునాయుడు సింగపూరులో ధీమాగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం జాప్యం కారణంగా 120 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు మాత్రమే బేరం కుదుర్చుకోగలిగింది. అంటే వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు వస్తున్న 950 మెగావాట్లు నిలిచి పోయి 120 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వస్తుంది. పైగా అప్పటికి విద్యుత్తు అవసరం ఇప్పటికంటే వేయి మెగావాట్లు పెరుగుతుంది. ఇప్పటి స్థాయితో పోల్చితే కొరత 1830 మెగావాట్ల మేరకు ఉంటుంది. కృష్ణపట్నం 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటా కింద 900 మెగావాట్లు కేంద్రం సహా యంతోనో, ఏపీ సర్కార్ సద్భావనతోనో తెచ్చుకోగలిగితే కొంతమేరకైనా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్ గోయల్‌ను కలుసుకొని పరిస్థితిని వివరించడానికి తెరాస ఎంపీలు సిద్ధం అవుతున్నారని వినికిడి. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ కొత్తగా మంత్రి మండలిలో చేరిన బండారు దత్తాత్రేయకు సన్మానం చేస్తూ కేసీఆర్ విజ్ఞప్తి చేయడం విడ్డూరం. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానితో చర్చించవలసిన ముఖ్య మైన అంశమిది. ఏపీ అవ రోధాలు సృష్టించకుండా నిరోధించాలన్నా, వచ్చే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వ్యవసాయరంగానికి కోత లేకుండా విద్యుత్తు సర ఫరా చేయాలన్నా పీయూష్ గోయల్ నిర్ణయం తెలంగాణలో కూడా అమలు జరగా లన్నా కేసీఆర్ మోదీతో, గోయల్‌తో సాధ్యమైనంత వివరంగా చర్చించవలసి ఉంటుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, యూనిట్‌కు రూ.6.72 చొప్పున కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకోవడం మంచి పరిణామమే. ఇటువంటి అనేక చర్యలు సత్వరం తీసు కుంటే తప్ప ఖరీఫ్‌లో, ఆ తర్వాత రబీలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడం సాధ్యం కాదు.
నిధుల సమీకరణే ప్రస్తుత కర్తవ్యం
బడ్జెట్ అంచనాలలో చూపించిన లోటు పూడ్చలేని పక్షంలో ఏ పద్దుకు కోత పెడతారోనన్నది ఆసక్తికరమైన అంశం. పంచాయతీరాజ్ రోడ్ల కోసం మునుపె న్నడూ లేని విధంగా రూ.2000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని సవరిస్తారా లేక ఇతర సంక్షేమ పద్దులకు గండి పెడతారా? ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కి రూ.5000 కోట్లు కేటాయించడమే కష్టమైనప్పుడు తెలంగాణ రూ.12000 కోట్లు కేటా యించడం సాధ్యమా అన్న జానారెడ్డి ప్రశ్న కూడా సవ్యమైనదే. ఒక వేళ అంత మొత్తం కేటాయించి, విడుదల చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కింద అనుసరించవలసిన విధివిధానాలూ, మార్గదర్శక సూత్రాలూ ఖరారు చేయకపోతే, ప్రభుత్వ శాఖలకు నిధులు అప్పజెప్పితే పాత కథే పునరావృత్తం అవుతుంది. నిధుల న్నిటినీ కలగలిపి (పూల్ చేసి) పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరదు. బడ్జెట్‌పైన చర్చ ముగిసింది కనుక అనంతరం తీసుకోవలసిన అనేక సత్వర చర్యలపైన ప్రభుత్వం అవశ్యం దృష్టి సారించాలి. ముఖ్యంగా విద్యుచ్ఛక్తి రంగంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్న సంతోషం ప్రజలకు మిగలాలంటే ఆచరణసాధ్యమైన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చి తక్కిన వాటిని పక్కకు పెట్టాలి. నిధుల సమీకరణకు నిరంతరం కృషి చేయాలి.
కె. రామచంద్రమూర్తి