ప్రజా సమస్యలు తెలియని మీకు.. రాజకీయాలెందుకు?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజల సమస్యలు ఏ మాత్రం తెలియని ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ నందన్ నిలేకని కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి, బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్ విమర్శించారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ (న్యాయ, పరిశ్రమలు, ఆర్థిక విభాగాలు) సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
గత పదేళ్ల యూపీఏ పాలనలో ధరల పెరుగుదల, అవినీతిపై నిలేకని ఒక్కమాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. అవినీతి, కుంభకోణాలకు పర్యాయ పదంగా మారిన కాంగ్రెస్ను వెనకేసుకు రావడం ఆయనకు తగదని హితవు పలికారు. ఈసారి లోక్సభ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా వివిధ అంశాల ఆధారంగా జరుగుతాయని నిలేకని గుర్తుంచుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు, వంట గ్యాసు ధరలను నియంత్రించడంలో విఫలమైన కాంగ్రెస్కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంస్థల జాతీయ నాయకులు నీరజ్ తాయల్, మహేంద్ర పాండే, రజనీష్ గోయెంగా ప్రభృతులు పాల్గొన్నారు.