Producer Allu Aravind
-
బన్నీ భార్యకు ఆ అవసరం లేదు.. అయినా పనిచేస్తుంది : అల్లు అరవింద్
ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్ పద్మభూషణ్ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. తాజాగా రైటర్ ప్మభూషణ్ సక్సెస్ మీట్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్‌ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్‌గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. -
‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..!
- నిర్మాత అల్లు అరవింద్ ‘‘గీతా ఆర్ట్స్ సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యముంటుంది. సినిమా విడుదలకు ముందే పాటలను శ్రోతల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. అల్లు శిరీష్ హీరోగా నటించారు. లావణ్యా త్రిపాఠి నాయిక. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ‘శ్రీరస్తు శుభమస్తూ...’ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘పాటలు బాగుంటే సినిమాకు బలం పెరుగుతుంది. ‘సరైనోడు’ సినిమా పాటలను బాగా ప్రమోట్ చేశాం. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఆడియోను అలాగే ప్రచారం చేయాలను కుంటున్నాం. సినిమా అందరినీ అలరిస్తుందని చెప్పగలను’’ అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ గొప్పదనం చెప్పేలా సినిమా ఉంటుంది. పాత్రల మధ్య కుటుంబంలోని భావోద్వేగాలు ఉంటాయి. టైటిల్ ఉన్నంత బ్లెస్సింగ్‌గా సినిమా వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ- ‘‘ కొత్త జంట తర్వాత సినిమా ఇచ్చిన నాన్నగారికి థ్యాంక్స్. మంచి కథ, వినోదం ఉన్న సినిమా ఇది. లావ ణ్య సహజంగా నటించింది. తమన్ మ్యూజిక్ హిట్టవుతుంది’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ- ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. దర్శకుడు సినిమాను చాలా సహజంగా, కొత్తగా చిత్రీకరించారు’’ అన్నారు. -
సరైన సక్సెస్
‘‘మా సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన ‘హ్యాపీ’, ‘బద్రీనాథ్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. మా బ్యానర్లో ఎలాగైనా హిట్ సాధించాలనే నా కల ‘సరైనోడు’తో తీరింది. ఈ సినిమాతో మాస్‌లోకి వెళ్లాలనే నా లక్ష్యం రెండొందల శాతం నెరవేరింది’’ అని హీరో అల్లు అర్జున్ తెలిపారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ కాంబినేషన్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘బన్నీ ఓ సారి నావద్దకొచ్చి తనకు మాస్ ఇమేజ్ లేదని చెప్పడంతో నాకు వెంటనే బోయపాటి గుర్తొచ్చి కలిశాను. అతను ఆరు నెలలు వర్క్ చేసి కథ రెడీ చేశాడు. అతనిపై నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టా. బోయపాటి, బన్నీ కెరీర్లో అధిక వసూళ్లు సాధించిన చిత్రమిదే’’ అని చెప్పారు. ‘‘ప్రతి సినిమానూ తొలి చిత్రంగానే భావిస్తా. ‘లెజెండ్’ తర్వాత మంచి కథతో సినిమా చేయాలని బన్నీతో చేశా. శ్రీకాంత్‌గారు తన పాత్రకు ప్రాణం పోశారు. ఆది పినిశెట్టి విలన్‌పాత్రలో అద్భుతంగా నటించారు’’ అని దర్శకుడు బోయపాటి పేర్కొన్నారు. కథానాయికలు రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్, నటులు శ్రీకాంత్, సాయికుమార్, ఆది పినిశెట్టి, విద్యుల్లేఖా రామన్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ త దితరులు మాట్లాడారు. -
అతని ఇష్టం, కష్టం ఉన్నతస్థాయికి చేరుస్తాయి..
- నిర్మాత అల్లు అరవింద్ ‘‘ ‘దిల్’ రాజు మా కుటుంబ నిర్మాత. బన్నీతో ‘ఆర్య’ తీశాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మా ఫ్యామిలీ నటులందరికీ తారురోడ్డు వేసి నడిపించిన చిరంజీవిగారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సాయిధరమ్ తేజ్‌కు సిన్మాలపై ఉండే ఆసక్తి, కష్టపడే తత్వమే అతణ్ణి ఉన్నతస్థాయికి తీసుకెళతాయి. ఈ వేడుక చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ విజయవంతమైన అనుభూతి కలుగుతోంది’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘సుప్రీమ్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్, థియేటర్ ట్రైలర్‌ని హీరోలు వరుణ్ తేజ్, నాని విడుదల చేశారు. చిరంజీవి చెల్లెళ్ళు విజయదుర్గ (సాయిధరమ్‌తేజ్ తల్లి), మాధవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘13 ఏళ్లలో మేం 20 సినిమాలు తీయగా 16 విజయవంతమయ్యాయి. ఏడుగురు దర్శకులను పరిచయం చేశాం. నేను మా సంస్థలో సమర్పిస్తున్న తొలి సిన్మా ఇది. చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుని సాయిధరమ్‌తేజ్‌తో, పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం తీయాలనుకుని వరుణ్‌తేజ్‌తో చేస్తున్నా. సమ్మర్లో ‘సుప్రీమ్’ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘రాజ స్థాన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న రవికిషన్‌కి యాక్సిడెంట్ అయింది. అయినా సరే ఆయన వచ్చి, షూటింగ్లో పాల్గొన్నారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘అభిమానుల్లో ఒక్కరిగా ఉండే నేను ఈరోజు హీరో అయ్యానంటే అందుకు కారణం - మా ముగ్గురు మావయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్). ‘సుప్రీమ్’ టైటిల్ వినగానే కంగారుపడి చిరంజీవి మావయ్యకు చెబితే, ‘కంగారొద్దు. కష్టపడి చేయ’మన్నారు. వెయ్యి ఏనుగుల బలమొచ్చి చేశా’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. రాశీఖన్నా, రామజోగయ్య శాస్త్రి, దర్శకులు మలినేని గోపీచంద్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి మాట్లాడారు. -
పూర్తి స్థాయి హీరోయిజమ్!
బన్నీ (అల్లు అర్జున్) అంటే ఎనర్జీకి చిరునామా అని చాలామంది అంటారు. అంతెందుకు ఆయనను తన హిట్ చిత్రం ‘రేసు గుర్రం‘తో పోలిస్తే మరీ మంచిది అని బన్నీ అభిమానులు అంటారు. ఇప్పటివరకు నటించిన చిత్రాల ద్వారా బన్నీ కనబర్చిన ఎనర్జీ అలాంటిది మరి. ఆ ఎనర్జీ లెవల్స్‌కి మ్యాచ్ అయ్యే కథను దర్శకుడు బోయపాటి శ్రీను తయారు చేసుకున్నారు. ఇటీవల ఈ కథను నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వినడం ఓకే చేయడం జరిగిపోయింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ శనివారం తెలియజేశారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వచ్చే నెల జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి నిరవధికంగా షూటింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ హీరోయిజమ్ ఉన్న కథ ఇది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. అభిమానులు బన్నీని ఎలా చూడాలని కోరుకుంటారో అలాంటి ఎనర్జీ ఉన్న పాత్రతో బోయపాటి శ్రీను ఈ కథ తయారు చేశారు. ఇందులో బన్నీ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం. తమన్ పాటలు స్వరపరుస్తారు. ఎం. రత్నం సంభాషణలు సమకూరుస్తారు’’ అని చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ‘‘బన్నీ శారీరక భాషకు నప్పే కథ ఇది. కచ్చితంగా తెరపై కొత్త బన్నీ కనిపిస్తాడు. కథ వినగానే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరవింద్‌గారు, బన్నీ అంగీకరించారు. ఈ చిత్రం తర్వాత యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసే చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు.