అతని ఇష్టం, కష్టం ఉన్నతస్థాయికి చేరుస్తాయి..
- నిర్మాత అల్లు అరవింద్
‘‘ ‘దిల్’ రాజు మా కుటుంబ నిర్మాత. బన్నీతో ‘ఆర్య’ తీశాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మా ఫ్యామిలీ నటులందరికీ తారురోడ్డు వేసి నడిపించిన చిరంజీవిగారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సాయిధరమ్ తేజ్‌కు సిన్మాలపై ఉండే ఆసక్తి, కష్టపడే తత్వమే అతణ్ణి ఉన్నతస్థాయికి తీసుకెళతాయి. ఈ వేడుక చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ విజయవంతమైన అనుభూతి కలుగుతోంది’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘సుప్రీమ్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించారు.
సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్, థియేటర్ ట్రైలర్‌ని హీరోలు వరుణ్ తేజ్, నాని విడుదల చేశారు. చిరంజీవి చెల్లెళ్ళు విజయదుర్గ (సాయిధరమ్‌తేజ్ తల్లి), మాధవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘13 ఏళ్లలో మేం 20 సినిమాలు తీయగా 16 విజయవంతమయ్యాయి. ఏడుగురు దర్శకులను పరిచయం చేశాం. నేను మా సంస్థలో సమర్పిస్తున్న తొలి సిన్మా ఇది. చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుని సాయిధరమ్‌తేజ్‌తో, పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం తీయాలనుకుని వరుణ్‌తేజ్‌తో చేస్తున్నా. సమ్మర్‌లో ‘సుప్రీమ్’ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘రాజ స్థాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న రవికిషన్‌కి యాక్సిడెంట్ అయింది.
అయినా సరే ఆయన వచ్చి, షూటింగ్‌లో పాల్గొన్నారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘అభిమానుల్లో ఒక్కరిగా ఉండే నేను ఈరోజు హీరో అయ్యానంటే అందుకు కారణం - మా ముగ్గురు మావయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్). ‘సుప్రీమ్’ టైటిల్ వినగానే కంగారుపడి చిరంజీవి మావయ్యకు చెబితే, ‘కంగారొద్దు. కష్టపడి చేయ’మన్నారు. వెయ్యి ఏనుగుల బలమొచ్చి చేశా’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. రాశీఖన్నా, రామజోగయ్య శాస్త్రి, దర్శకులు మలినేని గోపీచంద్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి మాట్లాడారు.