professional training
-
Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి
ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు... వంటి కట్టుబాట్లు ఉన్న గ్రామంలో పుట్టిన మిత్తల్ గోహిల్ ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చదువుకుని, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడమేగాక, ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళలను చక్కగా తీర్చి దిద్దడంతోపాటు, తన సొంత గ్రామంలో ఎంతోమంది బాలికలకు ప్రేరణగా నిలుస్తోంది. గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్. ఈ గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది మిత్తల్ గోహిల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వ్యవసాయం చేసేవారు. వెయ్యిమంది ఉన్న గ్రామంలో మూఢాచారాలు ఎక్కువ. అమ్మాయిల్ని చదవనివ్వరు. చిన్నవయసులోనే పెళ్లి చేసి పంపిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పెరుగుతున్నప్పటికీ మిత్తల్ మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కలలు కనేది. కానీ గ్రామంలో అందరికీ విరుద్ధంగా తనని ఒక్కదాన్నే చదువుకోవడానికి పంపిస్తారా? అని కంగారు పడేది. కానీ మిత్తల్ తండ్రి ప్రోత్సహించడంతో పాఠశాల విద్య వరకు నవోదయ స్కూల్లో హాస్టల్ లో ఉండి చదువుకుంది. మిత్తల్ హాస్టల్ లో ఉండి చదవడాన్ని కూడా గ్రామస్థులు వ్యతిరేకించారు. కానీ మిత్తల్ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుబట్టి మరీ ఆమె తండ్రి చదివించడంతో.. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసి, తరువాత సోషల్ వర్క్‌లో మాస్టర్స్ కూడా చేసింది. ముగ్గురి నుంచి వందలమంది... కాలేజీ రోజుల్లో నవలలు చదివే అలవాటు ఉన్న మిత్తల్ నవలల్లోని రచనల ద్వారా భారతదేశంలో మహిళల పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆదివాసీలకోసం పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ ఇంట్లోవాళ్లు పంపించకపోవడంతో తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భారుచ్‌లో మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టులో ఏరియా మేనేజర్‌గా చేరింది. ఇక్కడ మూడున్నరేళ్లు పనిచేసిన అనుభవంతో 2017లో ‘దేశాయ్ ఫౌండేషన్’లో చేరింది. ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఈ ఫౌండేషన్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే తన పనితీరుతో దాదాపు ఐదు వందలమంది పనిచేసే అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దింది. దీంతో ఫౌండేషన్‌లో చేరిన రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యింది. ఫౌండేషన్ టీమ్‌తో కలిసి యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ముప్పై లక్షలమంది మహిళలు, బాలికల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్లెజర్ పిరియడ్... దేశాయ్ ఫౌండేషన్ ద్వారా.. మహిళాభివృద్ధి, సమాజంలో ఉన్నతంగా బతికేందుకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిలో భాగంగా ‘ప్లెజర్ పిరియడ్’ పేరిట పిరియడ్స్, మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడేలా వృత్తిపరమైన శిక్షణలు, కంప్యూటర్ ట్రైనింగ్, బ్యూటీ కోర్సులో శిక్షణ, పచ్చళ్లు, అప్పడాల తయారీ, క్యాండిల్స్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి స్టార్టప్ పెట్టడానికి కావాల్సిన రుణసదుపాయం కల్పించడం వరకు అన్ని రకాలుగా సాయపడుతూ మహిళా అభ్యున్నతికి పాటుపడుతోంది. మిత్తల్ తన నైపుణ్యంతో ఫౌండేషన్‌తోపాటు తన సొంత గ్రామంలో మార్పు తీసుకురావడం విశేషం. ‘‘అక్కలా చదవాలి...’’ నాన్న చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరుకునేవారు. తొలిసారి 2018లో అమెరికా వెళ్లినప్పుడు నాలుగు వందలమంది ముందు ఎంతో ధైర్యంగా ఇంగ్లిష్ మాట్లాడాను. నాన్న నా ఇంగ్లిష్ ప్రసంగాలను మెచ్చుకున్నారు. దేశాయ్ ఫౌండేషన్‌లో పనిచేస్తూ ఎంతోమంది బాలికలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. మా గ్రామంలో ఎంతోమంది చిన్నారులకు నేను ప్రేరణగా నిలుస్తున్నాను. గ్రామంలోని చాలా మంది తల్లిదండ్రులు మిత్తల్ అక్కలా, ఆ మేడంలా చదవాలి అని తమ కూతుళ్లకు చెబుతున్నారు. నా స్ఫూర్తితో గ్రామంలో ముప్పైమందికి పైగా అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేశారు. ఏడుగురు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ముసుగులు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చే మహిళలు ఇప్పుడు ముసుగు తీసి ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వారి మాటతీరు, కట్టుబొట్టు అంతా మారిపోయింది. ఇంతమంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది’’. – మిత్తల్ గోహిల్ -
నిరుద్యోగ యువతకు శుభవార్త
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్లేస్మెంట్ గ్యారంటీతో వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 18 వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 1,627 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించించి. మొత్తం అభ్యర్థుల్లో 702 మంది మైనారిటీ, 625 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గురుకుల విధానంలో రెండు నుంచి ఆరు నెలల కాల పరిమితి శిక్షణ ఉచితంగా అందించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఆపైన చదివిన అభ్యర్థులు శిక్షణకు అర్హులు. ప్రస్తుతం 512 మంది ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించేం దుకు ఈ సీఐఎల్ అలీఫ్, సెట్విన్, ఏస్, డైలాగ్ ఇన్డార్క్, క్యాబ్ ఫౌండేషన్, సీపెట్, డాన్వాస్కో టెక్నాలజీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలతో అధికార యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతాల వారీగా కోర్సులు ఇలా.. రియాసత్‌నగర్: ట్యాలీ,జీఎస్టీ, డీటీపీ, డిజైనింగ్ కోర్సులు అమీర్‌పేట: డీటీపీ, నెట్వర్కింగ్, హార్డ్‌వేర్ మలక్‌పేట, అంబర్‌పేట, నషేమాన్‌నగర్, హేజ్ బాబానగర్: టైలరింగ్ కోర్సులు విద్యానగర్, మీరాలం ట్యాంక్, బహదుర్ పురా, జూపార్క్: ఏసీ రిపేరింగ్, మొబైల్ సర్వీసింగ్, బ్యూటిషియన్. పెద్ద అంబర్‌పేట: లైఫ్ స్కిల్స్ (అంధులకు మాత్రమే) కోటి, దూద్‌బౌలి, బండ్లగూడ, గాగిల్లాపురం, రామాంతపూర్: హాస్పిటాలిటీ, బెడ్‌సైడ్ నర్సింగ్, రిటైల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్, వెల్డింగ్, ఏసీ సర్వీసింగ్ తదితర 70 రకాల ట్రేడ్స్. హకీంపేట: లైట్ మోటార్ వెహికిల్, హెవీ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి: 86397 87489 ఎస్సీ కార్పొరేషన్ ఈడీ: 94899 05999 ఈసీఐఎల్ ప్రోగామింగ్ ఆఫీసర్: 99857 98828 అలీప్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98498 02970 సెట్విన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98666 53908 ఏసీఈ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 94408 04858 పాలిటెక్నిక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99123 42001 క్యాప్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 87989 69698 సీఐసీఈటీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99593 33415 డాన్బాస్కోటెక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99005 46572 టీఎస్ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 10023 టీఎస్ ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 00936 -
ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం పెగా సిస్టమ్స్, టాలెంట్ స్ప్రింట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు యూనివర్సిటీ అకాడమిక్ ప్రొగ్రాం (యూఏపీ)ను ప్రారంభిస్తున్నట్లు పెగా సిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్ రెడ్డి, టాలెంట్ స్ప్రింట్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ శాంతను పాల్ చెప్పారు. శిక్షణ కోసం ప్రస్తుతానికైతే దేశంలోని 8 వర్సిటీలతో ఈ ఒప్పందం చేసుకున్నామని.. హైదరాబాద్ నుంచి వాసవి, సీబీఐటీ కళాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ రెండు సెమిస్టర్లుంటుందని.. ఒక్కో సెమ్‌కు రూ.7,500 ఫీజుంటుందని తెలిపారు. శిక్షణానంతరం సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తామన్నారు. త్వరలోనే ఇంజనీరింగ్‌తో పాటూ ఇతర విభాగాల విద్యార్థులకూ శిక్షణ ఇస్తామని చెప్పారు. -
ఎస్సీ న్యాయవాదులకు త్వరలో వృత్తి శిక్షణ
హన్మకొండ అర్బన్ : జిల్లాలో అర్హులైన ఎస్సీ న్యాయవాదులకు ప్రభుత్వ న్యాయవాది వద్ద వృత్తి శిక్షణ ఇప్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దళిత కులాల అభివృద్ధి సంస్థ డీడీ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదని, గతంలో శిక్షణ పొందని వారు మాత్రమే అర్హులని ఆయన చెప్పారు. శిక్షణలో మొత్తం 8 సీట్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఈనెల 30వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో హన్మకొండ కలెక్టరేట్లోని దళిత కులాల అభివృద్ధి శాఖలో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణ కోసం ఇంటర్వూ్య పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని డీడీ శంకర్ పేర్కొన్నారు.