మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు?
విశాఖపట్నం: పార్లమెంటు పవిత్రతే పాడైపోతే, అసెంబ్లీ అపవిత్రం అయిపోతే ఇక దేశానికి, ఈ రాష్ట్రానికి విలువ ఏముంటుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని ఏయూ ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
'ఈ కార్యక్రమాన్ని జరపనివ్వరు, అడ్డుకుంటారని పొద్దుట నుంచి ఫోన్లు వచ్చాయి. తీరా వస్తే వందలాది, వేలాది మంది విద్యార్థులు ఇక్కడున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం రాజకీయాలు చేయం. ఒకే కారణంతో ఇక్కడున్నాం. భావితరానికి ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు ఎంత గొప్పగా ఉంటాయో మాకు తెలుసు. విశాఖ, విజయనగరం విద్యార్థుల కోరిక మేరకు వైఎస్ జగన్ ఇక్కడకు వచ్చారు.
2014 మే 7వ తేదీన అప్పుడే ఆంధ్రలో ఎన్నికలు ముగిశాయి. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రత్యేక హోదా ఇస్తామనే పేరుతో రాష్ట్ర ఆదాయంలో 60 శాతం వాటా ఉన్న హైదరాబాద్‌ను మనకు దూరం చేశారని అప్పట్లో ఆయన చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఏమైనా ఉన్నాయా.. లేవు. అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాలేదు. ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్‌కు పేరు రాదు, అధికారంలో ఉన్న పార్టీకే వస్తుంది. అయినా కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ముందుకొచ్చారు.
విద్యార్థులు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు ఉండటం లేదు. పార్లమెంటు పవిత్రతే పాడైపోతే, అసెంబ్లీ అపవిత్రం అయిపోతే ఇక దేశానికి, ఈ రాష్ట్రానికి విలువ ఏముంటుంది? పార్లమెంటు సాక్షిగా ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని చెబితే, అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం పదేళ్లు ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు? కేవలం అబద్ధాల మీద ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఒకటా.. రెండా.. చాలా చాలా అబద్ధాలు చెబుతున్నారు. విద్యార్థులు వాట్సప్‌లో దీని గురించి మెసేజిలు పంపుతున్నారు.
ముఖ్యమంత్రి మొదలు మంత్రులందరూ కూడా అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారేమని విద్యార్థులు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రతిసారీ సింగపూర్, జపాన్ ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటోందని వాళ్లు అడుగుతుంటే ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు. చైనా, సింగపూర్ కాదు.. ఉత్తరాఖండ్‌కు వెళ్లి చూడండి. అక్కడ 3 వేల పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ప్రత్యేక హోదా ఉంద'ని పేర్కొన్నారు.