లెక్క తేలింది
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
మొత్తం అభ్యర్థులు 219..ఎ స్వతంత్రులు 83 మంది
మూడు లోక్‌సభ స్థానాలకు 41
15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 178
విశాఖ లోక్‌సభకు అత్యధికంగా 22 మంది
మాడుగుల అసెంబ్లీకి అత్యల్పంగా ఏడుగురు
నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారాలకు శ్రీకారం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ముఖ చిత్రం స్పష్టమైంది. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. 60 మంది పోటీ నుంచి వైదొలగడంతో జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు 41మంది, 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 178మంది ఎన్నికల సంగ్రామంలో తలపడనున్నారు. అన్ని స్థానాల్లోనూ బహుముఖ పోటీ నెలకొంది.
ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన నామినేషన్ల పర్వంలో మొత్తం 321 మంది నామినేషన్లు సమర్పించారు. పరిశీలనలో 42 నామినేషన్లు తిరస్కరించారు. ఉపసంహరణ అనంతరం బరిలో 219 మంది నిలిచారు. ఇందులో 83 మంది స్వతంత్రులే కావడం విశేషం. రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకోడానికి అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు పాక్షికంగా ఫలించాయి. మే 7న పోలింగ్,16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గాల్లో పోటీపై స్పష్టత రావడంతో అభ్యర్థులు ప్రచార షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
గురువారం నుంచి ప్రచారాలతో మరింత హోరెత్తించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా13 రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు.
అసెంబ్లీకి 54 ఉపసంహరణలు
జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి మొత్తం 271 నామినేషన్లు రాగా 39 మందివి తిరస్కరించారు. బుధవారం 54 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
దీంతో ఎన్నికల బరిలో 178 మంది పోటీ పడుతున్నారు.
విశాఖ-ఉత్తరం, అరకు వ్యాలీ, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో అధికంగా ఆరుగురు చొప్పున నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
విశాఖ తూర్పులో వచ్చిన 26 నామినేషన్లకు అయిదింటిని తిరస్కరించగా మిగిలిన వారెవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీం తో ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 21 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
గాజువాకలో 17, విశాఖ దక్షిణంలో 15 మంది తలపడుతున్నారు.
మాడుగుల నియోజకవర్గం నుంచి తక్కువగా 7 మంది బరిలో ఉన్నారు.
చోడవరం నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి జె.కనకమహాలక్ష్మితో పాటు ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
విశాఖ-దక్షిణంలో సీపీఎం అభ్యర్థి పి.వెంకటరెడ్డి, జె.దేముడునాయుడుతో పాటు స్వతంత్ర అభ్యర్థి కోల యల్లాజి నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు.
విశాఖ-పశ్చిమంలో సీపీఐ అభ్యర్థి సి.హెచ్.రాఘవేంద్రరావు, స్వతంత్ర అభ్యర్థి దాడి అచ్యుతలు పోటీ నుంచి తప్పుకున్నారు.
యలమంచిలిలో అయిదుగురు, భీమిలిలో నలుగురు, పాడేరులో నలుగురు, గాజువాక, అనకాపల్లిలలో ముగ్గురు, మాడుగులలో ఇద్దరు, పెందుర్తిలో ఒకరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
లోక్‌సభ స్థానాలకు 6 ఉపసంహరణలు
విశాఖ లోక్‌సభ స్థానానికి 26 నామినేషన్లు రాగా ఇందులో నలుగురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీపీఎం అభ్యర్థి సి.హెచ్.నరసింగరావు, సీపీఐ అభ్యర్థి మానం ఆంజనేయులుతో పాటు స్వతంత్రలు బి.శ్రీలక్ష్మి, వై.చిన్నయ్యలు నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. జై సమైక్యాంధ్ర, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో విశాఖ లోక్‌సభ స్థానంలో జైసపా పార్టీ అభ్యర్థికి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఇందులో భాగంగా సీపీఎం, సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
అనకాపల్లి లోక్‌సభకు 11 నామినేషన్లు రాగా, రెండింటిని అధికారులు తిరస్కరించారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి టి.అప్పారావు పోటీ నుంచి తప్పుకున్నారు.
అరకు ఎంపీకి 13 నామినేషన్లు దాఖలు కాగా, ఒకరిది తిరస్కరించగా, స్వతంత్ర అభ్యర్థి జె.యతిరాజులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.