మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’తో భరోసా
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలాల స్థాయిలోనూ చేపట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. కలెక్టర్లు, జిల్లాల అధికారులు స్వయంగా హాజరై వినతులు స్వీకరించి.. వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అలాగే ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు కూడా జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, ప్రజా సమస్యలను మరింత సంతృప్త స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1906 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు తెలియజేస్తే.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు నాలుగు స్థాయిల్లో ఆడిట్ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. సీఎంవో అధికారులు, శాఖాధిపతులు, కలెక్టరేట్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల నుంచి మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు నిర్వహిస్తున్నారు.
ఏ రోజు.. ఏ మండల కేంద్రానికి కలెక్టర్లు, అధికారులు వస్తారో ముందే తెలియజేస్తున్నారు. దీంతో ప్రజలు ఆయా మండల కేంద్రాలకు వెళ్లి కలెక్టర్లను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వచ్చిన వినతులను అధికారులు అదే రోజు ‘జగనన్నకు చెబుదాం’ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి 13,365 సమస్యలపై వినతులు వచ్చాయి. ఇందులో 4,517 పరిష్కారమవ్వగా.. 8,777 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి. రీ ఓపెన్‌లో 71 సమస్యలున్నాయి. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి.. పురోగతిని తెలుసుకున్నారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు.