రేపు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ రాక
- జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష
- పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు వెల్లడి
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ ఆదివారం జిల్లాకు రానుంది. మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డిలతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో కమిటీ సభ్యులు లోతైన విశ్లేషణ చేస్తారన్నారు. పార్టీకి దశదిశ నిర్దేశం చేస్తారని, జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలపై చర్చిస్తారని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాటం
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని బాలరాజు చెప్పారు. మోడి గాలిలో చంద్రబాబు విజయం సాధించారని, అది అతని గొప్పదనం కాదన్నారు. చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వ చ్చాడని విమర్శించారు. చంద్రబాబు తన మొదటి సంతకాన్ని రైతుల రుణాలు మాఫీ ఫైలుపై సంతకం పెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేస్తే రైతులు కొత్త రుణాలు తీసుకుని వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.