భవిత మనదే..
భవిష్యత్ కార్యాచరణ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. కార్యకర్తలకు భరోసా కల్పించడం.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం.. రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం.. ప్రజల పక్షాన నిలిచి పోరాట పంథాలో సాగడం.. అనే ప్రణాళికతో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు రాజమండ్రి వేదికగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు సమీక్షలో భాగంగా గురువారం పాలకొండ, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :‘ప్రజల నుంచి పుట్టిన పార్టీ మనది. ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. భవిష్యత్తు మనదేనని చెబుతున్నాయి. కాబట్టి ఇకముందు కూడా ప్రజ ల్లోనే ఉందాం. వారి పక్షాన నిలుద్దాం. తప్పకుండా ప్రజలు భవిష్యత్తులో మనకే పూర్తి మద్దతు ప్రకటించి ఆశీర్వదిస్తారు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో చెప్పారు. రాజమండ్రిలో రెండో రోజు గురువారం ఆయన పాలకొండ, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల ఫలితాలపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలన్న తలంపు తనకు లేదన్నారు. ‘మొదట్లో ఇబ్బందులు వచ్చినా ఫర్వాలేదు.. ఎదుర్కొందాం.. అంతేగానీ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసపుచ్చే విధానాలను మాత్రం అవలంబించే దుష్ట రాజకీయం మనకు వద్దు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆయువు పట్టు. ఆ విధానానికి కట్టుబడితే అంతిమ విజయం మనదే..’ అని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట
పార్టీని పోరాట పథంలో ముందుకు నడిపించడానికి పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? రాష్ట్ర స్థాయి పరిణామాలకు కారణమేమిటి? ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో చురుగొనేలా పార్టీని నడిపించేందుకు ఎలాం టి విధానాలను అనుసరించాలి? అనే విషయాలపై కార్యకర్తలను ప్రశ్నించారు. వారుచెప్పిన సమాధానాలపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తయిన తరువాత నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
టీడీపీ హామీల అమలుపై దృష్టి పెట్టాలి
టీడీపీ ఇచ్చిన హామీల అమలు తీరును నిశితంగా గమనించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కాగా, తామంతా పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంట సాగుతామని సమావేశాల్లో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటామన్నారు. ఈ సమావేశాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీ నాయన, ఎచ్చెర్ల అభ్యర్థి గొర్లె కిరణ్‌లతోపాటు పార్టీ నేతలు మీసాల నీలకంఠంనాయుడు, పాలవలస విక్రాంత్, చందక జగదీష్, పాలవలస శ్రీను, దుప్పలపూడి శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, సిరిపురపు జగన్మోహన్‌రావు, టంకాల అచ్చెన్నాయుడు, గొర్లె రాజగోపాల్, పిన్నింటి సాయి, జీరు రామారావు, బల్లాడ జనార్దన్‌రెడ్డి, గొర్లె అప్పలనాయుడు, దన్నాన రాజినాయుడు, టొంపల సీతారామ్, మురళీధర్ బాబా, కె.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.