కార్యకర్తలకు అండగా ఉంటాం
కాకినాడ: సార్వత్రిక ఎన్నికల ఓటమితో అధైర్యపడకుండా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై బుధవారం విశాఖపట్నంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటమికి దారితీసిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఓటమికి గల కారణాలపై నివేదికను చంద్రశేఖరరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందన్నారు.
సమర్థవంతమైన ప్రతిపక్షంలా వ్యవహరించి ప్రజలకు తోడుగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా, వేధింపులు ఎదురైనా పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడలో పార్టీ ఎంతో బలీయంగా ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా వక్ఫ్‌కమిటీ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అనుబంధ విభాగాల కన్వీనర్లు పసుపులేటి వెంకటలక్ష్మి, కిషోర్, రోకళ్ల సత్యనారాయణ, అక్బర్ అజామ్, దుగ్గన బాబ్జీ, మాజీ కార్పొరేటర్లు ఐ.శ్రీను, కొప్పుల విజయకుమారి, కొలగాని దుర్గాప్రసాద్, సిరియాల రాము, సిరియాల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.