బస్సుల్లో జీపీఎస్‌ను వాళ్లే అమర్చాలి
న్యూఢిల్లీ: ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణికులకు భద్రతగా, ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాహనాల్లో జీపీఎస్ పరికరాన్ని వాహన తయారుదారు లేదా డీలర్ ఇన్ స్టాల్ చేయాలని రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది. అలర్ట్ బటన్, సీసీటీవీ నిఘా వ్యవస్థను కూడా అమర్చాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. సీటింగ్ కెపాసిటీ 23 కంటే ఎక్కువ ఉన్న వాహనాలు ఈ మూడు ఫీచర్లు కలిగి ఉండాలని, 23 కంటే తక్కువ ఉన్న వాహనాల్లో కూడా కచ్చితంగా వాహన ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్ ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపింది.
2014 జనవరిలోనే నిర్భయ ఫండ్, మొదటి ప్రాజెక్టు కింద 32 నగరాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్ లు, జీపీఎస్ పరికరాలు అమర్చాలన్న నిబంధనలకు యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఆ ప్రాజెక్టు సక్రమంగా అమలుకాలేదు. 2012 డిసెంబర్లో నిర్భయ ఘటన అనంతరం నిర్భయ ఫండ్‌ను గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పబ్లిక్ వాహనాల రూట్లు తెలుసుకోవడం, ఆయా మార్గాలలో వాహనాలను ట్రాక్ చేయడం, ఎమర్జెన్సీ సమయంలో పానిక్ బటన్ ద్వారా పోలీసులను అప్రమత్త చేయడం లాంటివి ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు.