పుష్కర స్నానంతో పునీతం...
కనగల్ : భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపుర ం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మించిన పుష్కరఘాట్‌కు గురువారం భక్తులు పోటెత్తారు. పవిత్ర పర్వదినం రాఖీ పౌర్ణమి కావడంతోపాటు సెలవుదినమైనందున పుష్కరస్నానం, దైవదర్శనం ఒకే చోట కలుగుతున్నందున దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పుష్కర భక్తులతోపాటు ఘాట్, అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కుంకుమార్చన , అభిషేకాలు తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఘాట్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్ ఇన్చార్జి రాజేందర్‌తోపాటు తహసీల్దార్ కృష్ణయ్య, షిప్టు ఇన్చార్జి డి.సీతాకుమారి చర్యలు తీసుకున్నారు. అమ్మవారి ఆలయం వద్ద జిల్లా కేంద్రానికి చెందిన కౌన్సిలర్ నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. దర్వేశిపురం ఘాట్‌లో 29,000 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అంచనాలకు మించి భక్తులు దర్వేశిపురం ఘాట్‌కు భక్తులు పుష్కర స్నానాలకు వస్తున్నందున అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే కనగల్ మండలకేంద్రంలోని వాగులో ఉన్న పుష్కరఘాట్‌లో స్వల్పంగా 500 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. రెండు ఘాట్ల వద్ద ప్రయాణికులతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.