గింజ కొంటే ఒట్టు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సీజనులోనూ ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమ్మకాల సీజను ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మరో పక్షం రోజుల్లో ఈ సీజను కూడా ముగుస్తుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో అసలు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. సుమారు 52 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఇన్నాళ్లు ఎన్నికల హడావుడిలో పడిన జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలు ముగిసాక కూడా కొనుగోళ్లపై ఆశించిన మేరకు దృష్టి సారించడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అన్నదాత అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు ధరలో భారీగా కోత విధించి నిలువు దోపిడీ చేస్తున్నారు.
52 కేంద్రాల్లో కొనుగోళ్లు నిల్
రబీ కొనుగోళ్ల సీజనులో జిల్లాలో సుమారు 77,700 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా కొచ్చింది. ఇందులో 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కనీస మద్దతు ధర గ్రేడ్ -ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,345, సాధారణ రకానికి రూ.1,310 చొప్పున ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం 177 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 87 కేంద్రాలు, ఐటీడీఏ ఆధ్వర్యంలో 25 కేంద్రాలు, సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్ ద్వారా నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు.
కానీ ఇప్పటివరకు కేవలం 125 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 34,260 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగారు. ఏటా జూన్ మొదటి వారం వరకు సీజను ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం పక్షం రోజులు మాత్రమే సీజను కొనసాగుతుంది. కానీ 52 కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు షురూ కాలేదంటే అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. జిల్లాలో రబీలో అత్యధికంగా నిర్మల్ వ్యవసాయ డివిజన్లో వరిని ఎక్కువగా సాగు చేస్తారు. సారంగాపూర్, దిలావర్పూర్, లోకేశ్వరం, లక్ష్మణచాంద, ఖనాపూర్, కడెం మండలాల్లో వరి సాగుచేస్తారు. అలాగే జన్నారం, దండేపల్లి, చెన్నూరు, జైపూర్, మంచిర్యాల మండలాల్లో వరి బాగా పండుతుంది. నిర్మల్ డివిజన్లో పంట ఆలస్యంగా చేతికొస్తున్నందునే కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఆనంద్‌రెడ్డి పేర్కొన్నారు.
కనీస సౌకర్యాలు కరువు
పలు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా టార్పాలిన్లు లే కపోవడంతో వర్షం పడితే చాలు అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొను గోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. అదేవిధంగా పలు కేం ద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేవు. పైగా మాయిశ్చర్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో కూడా కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.