అమ్మలా ఆదుకుంటూ...
గుర్ల, న్యూస్‌లైన్: ‘సంపద సుఖాన్నిస్తే... సేవ తృప్తినిస్తుంది.’ మన పెద్దలు చెప్పిన అపురూపమైన మాట ఇది. ఈ వాక్యాన్ని అక్షరాలా పాటిస్తున్నారీ మాస్టారు. గంట కొట్టగానే పుస్తకం తెరిచి, మళ్లీ గంట కొట్టగానే పుస్తకం మూసి బడి నుంచి బయటపడే ఉపాధ్యాయుడు కాదాయన. గురువంటే విద్యతో పాటు విలువలు కూడా బోధించాలని, బోధించిన విలువలను చేసి చూపాలని మనసా వాచా నమ్ముతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరు పురుషోత్తమరావు. పేరుకు తగ్గట్టే నలుగురికీ మంచి చేస్తూ ఉత్తమ గురువుగా ప్రశంసలు అందుకుంటున్నారాయన. ఆయన స్థాపించిన సంస్థే అమ్మ సేవా సొసైటీ. డబ్బులు లేక చదువు ఆపేస్తున్న విద్యార్థులను, చలికాలంలో అవస్థలు పడుతున్న అభాగ్యులను, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షిస్తూ ఈ సంస్థ అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ సంస్థ విజయం సాధిం చడం వెనుక ఉన్న ప్రధాన కారణం పురుషోత్తమరావు మాస్టారే.
గుర్ల మండలంలోని పాలవలస దగ్గరున్న నల్ల చెరువు ఎంపీపీ స్కూ లులో ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే అయినా ప్రవృత్తి రీత్యా సంఘ సంస్కర్త కూడా. తన నెల జీతంలో మూడు వంతులు ప్రజాసేవకే ఆయన ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తయారు చేయడం, ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సాయం చేయడం, సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం ఆయన ప్రత్యేకతలు. కేవలం సమాజ సేవలోనే కాదు బోధనలో కూడా ఆయన పేరెన్నికగల వారే. ఓ సారి స్కూలు పరిశీలనకు వచ్చిన ఎంపీ ఝాన్సీలక్ష్మి వద్ద ఓ నాలుగో తరగతి విద్యార్థితో ఏకధాటిగా ఇంగ్లిష్‌లో మాట్లాడించి ఔరా అనిపించారు. అలాగే చుట్టుపక్కల బాగా చదివే పేద పిల్లలను గుర్తించడం వారిని అమ్మ సొసైటీ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి చదివించడం వంటివి కూడా చేస్తున్నారు. ఇంతవరకు ఈయన 60 మంది విద్యార్థులను ఇంజినీరింగ్, మెడిసిన్, డీఈడీ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్ చదివించారు. ఈ విద్యార్థులకు ఫీజులు కట్టడంతో పాటు భోజన, వసతి సదుపాయాలు కూడా చూస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం తన బాధ్యత అని, అందుకోసమే ఈ ప్రయత్నమని ఆయన అంటుంటారు.