pusapati rega
-
విశాఖ గ్యాస్ లీక్ : పెళ్లైన రెండు నెలలకే
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్సైన్సెస్లో గ్యాస్‌లీక్‌తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. పూసపాటిరేగ : ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్సైన్సెస్లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు.(విష వాయువు లీక్.. ఇద్దరు మృతి) రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్‌పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రెండు నెలలకే... రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్‌లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చంపావతి గుండెకోత పాపం ఎవరిది..?
సాక్షి, పూసపాటిరేగ(నెల్లిమర్ల) : అక్కడ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్య తీర్చే బావులకు ముప్పు ఏర్పడుతున్నా... అక్రమార్కులు వెరవడం లేదు. ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తూ కాసులు కూడబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఉచితం మాటున సాగుతున్న ఈ దందాకు చంపావతి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. పూసపాటిరేగ మండలంలోని చంపావతి ప్రాజెక్టును ఆనుకొని అక్రమ ఇసుక తవ్వకాలు చేయడంతో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి వుంది. ఊటబావులకు నీరందకపోవడమే గాకుండా నీటిసామర్థ్యం తగ్గి మోటార్లు మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి పూసపాటిరేగ మండలంలో 32 గ్రామాలు, డెంకాడ మండలంలో 10 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొంత కాలంగా అక్రమ ఇసుకతవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రాజెక్టును ఆనుకొని ఇసుక తవ్వకాలు జరపడంతో భూగర్భజలాలు అడుగంటితున్నాయి. పూసపాటిరేగ మండలానికి ఇదే ప్రధాన నీటి వనరు. అదే ఇప్పుడు సరిగ్గా పనిచేయకపోవడంతో పల్లెప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. 2010లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు సుమారు రూ. 12 కోట్లతో అప్పట్లో ప్రాజెక్టు పనులు చేశారు. పనులు పూర్తి చేసిన తరువాత కొన్నాళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరే దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. తాజాగా ఆ నిర్వహణ బాధ్యతను అధికారపార్టీ నాయకులకు అప్పగించడంతో వారు సక్రమంగా చేయడం లేదనే విమర్శలు వెలువడుతున్నాయి. ప్రాజెక్టు పైపులైన్ నాసిరకంగా వుండటంతో ఎప్పటికప్పుడు లీకులు ఏర్పడి నీరు వృథా అవుతోంది. దీనికి తోడు ప్రాజెక్టు సమీపంలో అక్రమతవ్వకాలను నిలుపుదల చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పైప్‌లైన్ ఉన్నచోటే తవ్వకాలు ప్రాజెక్టు పైపులైన్ వున్నచోటనే తవ్వకాలు జరపడంతో పైపులైన్ బయటకు తేలిపోయింది. ఇవి తరచూ పగలిపోతుండటంతో నిత్యం మరమ్మతులు చేయాల్సి వస్తోంది. అధికారులు దీనిని పట్టించువడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూసపాటిరేగతో పాటు సీహెచ్.అగ్రహారం, కనిమెట్ట, అల్లాడపాలెం, కనిమెల్ల, కామవరం, పతివాడ, చినపతివాడ, గోవిందపురంతో పాటు పలు గ్రామాలకు ప్రాజెక్టు నీరుసరఫరా అవుతోంది. పూసపాటిరేగ మండలంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా వుండటంవల్ల ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా మళ్లీ సమస్య ఉత్పన్నం అవుతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్టుకు ఆనుకొని ఇసుక తవ్వకాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్ శంకర్ వద్ద ప్రస్తావించగా తవ్వకాలు నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఉసురు తీసిన పోలియో చుక్కలు!
వాంతులతో అస్వస్థత.. చికిత్సకు తీసుకెళ్తుండగా చిన్నారి మృతి విజయనగరం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి 5 నెలల ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో ఆదివారం చిన్నారి తరుణికి పోలియో చుక్కలు వేసిన అనంతరం కొద్దిసే పటికి తల్లి స్వాతి పాలుపట్టింది. వెంటనే తరుణి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స కోసం సుందరపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగా తరుణి మృతి చెందింది. పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరాడక చిన్నారి చనిపోయిందని, పోలియో చుక్కలు కారణం కాదని డీఎంహెచ్ఓ సి.పద్మజ తెలిపారు.